Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకునే యత్నం
- నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి
- ఉపఎన్నికల్లో ఓడినప్పుడల్లా టీఆర్ఎస్ హడావుడి : సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, బాగం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బాగం హేమంతరావు అన్నారు. ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ రైతులతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఢిల్లీలో.. ధర్నాలు రాష్ట్రంలో.. అనేలా టీఆర్ఎస్ తీరు ఉందన్నారు. యాసంగిలో ధాన్యమే వద్దంటూ.. వానాకాలంలో కొన్నే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోతినేని, బాగం మాట్లాడారు. గతంలో భారత్ బంద్‌లో పాల్గొని యూటర్న్ తీసుకున్న కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ టీఆర్ఎస్ ఏదో ఓ రీతిలో హడావుడి చేసి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. దీనిలో భాగంగానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను మోసగించేందుకే శుక్రవారం టీఆర్ఎస్, గురువారం బీజేపీలు ధర్నాలు చేశాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు ధాన్యం కొనుగోలు చేయకుండా ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులందరినీ ఐక్యం చేసి మరింతగా ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మరింత సమస్యల ఊబిలోకి నెడుతున్నాయన్నారు. ఈ ధర్నాకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, బండి పద్మ, వై.విక్రమ్, తుశాకుల లింగయ్య, భూక్యా శ్రీను, సుదర్శన్, సీపీఐ జిల్లా నాయకులు జానీమియా, మౌలాన, సలాం, జితేందర్ పాల్గొన్నారు.