Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం, రామోజీ తండాకు చెందిన గుగులోత్ వీరశేఖర్ అనే గరిజన యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా దాడిచేశారనీ, ఆ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన సంఘం రాష్ట్ర కమిటి సమావేశంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించామని తెలిపారు.వీర శేఖర్‌ను అస్వస్థతకు గురయ్యే వరకూ కొట్టి స్పృహ లేని పరిస్థితుల్లో ఇంటికి పంపించిన ఈ వ్యవహారంలో ఎస్.ఐ,ఇతర పోలీసుల పాత్ర పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు చట్ట విరుద్ధంగా అమాయకులపై కేసుల పేరుతో స్టేషన్లకు తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టడం సరి కాదని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు అడుగడునా మానవ హక్కులను ఉల్లంఘించారని తెలిపారు. గిరిజన యువకుడిని చిత్ర హింసలు పెట్టినా.. ప్రభుత్వం తరపున మంత్రులు, జిల్లా కలెక్టర్ పరామర్శించకపోవడం అన్యాయమని తెలిపారు. ఈ ఘటనలో ఎస్ ఐ ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దళితుల, గిరిజనుల పట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎం.కుర్మయ్య, బోడ సామెలు, నందీపాటి మనోహర్, అతిమెల మాణిక్యం, అరూరి కుమార్, టి. సురేష్ కుమార్, రాపోలు మహిపాల్, గంటేపోగు రాజు, కోట గోపి, దయ్యపు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.