Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ అధికారుల భరోసా
- నోటీసులు ఇచ్చేదీ వారే...
- కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోమనేదీ వారే..
- దారితప్పుతున్న టౌన్‌ప్లానింగ్ విభాగం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పై ఫోటోలో నాలుగంతస్తుల భవన నిర్మాణాన్ని చూశారా...హయత్‌నగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్-6లో నిర్మితమవుతున్న ఈ భవనానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినా ఎలాంటి సెట్బ్యాక్లు వదలకుండా, రోడ్డును కూడా ఆక్రమించి, దర్జాగా కట్టేస్తున్నారు. ఇంటికి మూడు పక్కల హద్దుల్లో ఉన్న పొరుగువారి ప్రహరీగోడల మీది నుంచి పోర్టికోలు, వాష్‌రూంలు నిర్మిస్తున్నారు. దీనిపై కాలనీవాసులు అక్టోబర్ 28వ తేదీ హయత్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నేరుగా అక్కడి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఏ మారుతీదివాకర్ను కలిసి మళ్లీ ఫిర్యాదు చేశారు. అప్పటికప్పుడే ఆయన ఆ ప్రాంత టౌన్‌ప్లానింగ్ అధికారి (టీపీఓ) మన్సూర్‌కు ఫోన్ చేసి, విచారణ జరిపి, చర్యలు తీసుకోమని చెప్పారు. మన్సూర్ ఫోన్ నెంబర్‌ను ఫిర్యాదుదారులకు ఇచ్చారు. మళ్లీ వారం గడిచింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తడు. దీనితో ఆఫీసుకు వెళ్లి విషయం చెప్పారు. ఆయన తన కింద పనిచేసే చైన్‌మెన్ శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆయనతో మాట్లాడకోమని చెప్పారు. ఈ లోపు విషయం తెలిసిన ఆ భవన యజమాని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పనులు చేయిస్తూ, మరో రెండు అంతస్థులు పూర్తి చేసేశాడు. పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు ఎలా పుట్టుకొస్తున్నాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇదే ప్రాంతంలో నెలరోజుల క్రితం ఇలాంటి ఫిర్యాదే వస్తే...అదే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది భవన యజమానితో 'ప్యాకేజీ' మాట్లాడుకొని, అక్రమ నిర్మాణం (యూసీ) అంటూ నోటీసు ఇచ్చి, కోర్టు నుంచి స్టే తెచ్చుకొని, నిర్మాణాన్ని కొనసాగించుకోమని సలహా కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం మొత్తానికి వారే 'ప్యాకేజీ' రూపంలో మాట్లాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉన్న 65 మున్సిపాల్టీలను, ప్రభుత్వం 142కి పెంచింది. దీనితో పట్టణాల సంఖ్యతో పాటు అక్రమ నిర్మాణాల సంఖ్యా భారీగా పెరిగింది. అదే సమయంలో ఈ తరహా అక్రమ 'ప్యాకేజీ'లు పెరిగినట్టు తెలుస్తున్నది. ఇటీవల అవినీతి నిరోధకశాఖ అధికారులు చేసిన దాడులు ఈ 'ప్యాకేజీ'ల గుట్టును రట్టుచేశాయి. ఆయా మున్సిపాల్టీల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చిన యూసీ నోటీసులకూ, కోర్టుల నుంచి వచ్చిన స్టేలనూ లెక్కిస్తే, ఈ రెంటి మధ్యా భారీ కుంభకోణమే ఉన్నట్టు కనిపిస్తున్నదని బాధితులు చెప్తున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే అక్రమ నిర్మాణ నోటీసుల్లో (యూసీ) కోర్టు నుంచి స్టే వచ్చే సెక్షన్లనే రాస్తూ, భవన యజమానులకు సహకరిస్తున్నారని కాలనీ సంఘాలు చెప్తున్నాయి. టీఎస్-బీపాస్‌తో అన్ని అనుమతులు నిర్ణీత టైంలో ఒకేసారి ఇచ్చేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్తున్నా...క్షేత్రస్థాయిలో బీపాస్ దరఖాస్తుదారులకు అధికారులు, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. పైగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, 'ప్యాకేజీ' ఇస్తే 'మేం కళ్లుమూసుకుంటాం...మీరు కట్టేసుకోండి' అని భరోసా ఇస్తున్నారని పలు కాలనీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో అక్రమ నిర్మాణాలపై ఏడాదికి రెండుసార్లు విచారణ జరుగుతుంది. ఆ సమయంలో పురపాలకశాఖ అధికారులు అప్పటికప్పుడు హడావిడిగా భవనాలను పాక్షికంగా కూలగొట్టి, ఆ ఫోటోలు, వీడియోలను న్యాయస్థానానికి చూపిస్తుండటం, కేసులు వాయిదా పడటం పరిపాటిగా మారిందని ఓ పౌరసంఘ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయ్యప్ప సొసైటీ, మణికొండ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో జీహెచ్ఎంసీ చేసే హడావిడిని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఇప్పటికైనా పురపాలకసంఘ అధికారులు తమ విధుల్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే, అక్రమ భవన నిర్మాణాలకు కళ్లెం పడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కూలగొడతాం
అక్రమ నిర్మాణాలకు సహకరించే అధికారుల్ని ఉపేక్షించం. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అలాంటి భవనాల్ని కచ్చితంగా కూలగొడతాం. టీఎస్-బీపాస్ వంటి అవినీతి రహిత వ్యవస్థను ప్రవేశపెట్టాక పౌరులు వాటిని వాడుకోవాలి. కొందరి దురాశ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నది. ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులపైనా స్పందిస్తున్నాం. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి.
- పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు