Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కట్టలు తెంచుకున్న విభేదాలు
- అధిష్టానం ముందే పరస్పర ఆరోపణలు
- ఈటలను వద్దన్నది నీవే కాదా?
- భట్టికి కేసీ వేణుగోపాల్ చురకలు
- ఉత్తమ్ వర్సెస్ పొన్నం
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప పోరు... కాంగ్రెస్ ఇంటిపోరుగా మారింది. ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుందామని ఢిల్లీ వెళ్లిన నేతల్లో లొల్లి మొదలైంది. అంతర్గత విభేదాలు కట్టలు తెంచుకున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు. హుజూరాబాద్ ఫలితాలపై చర్చ కంటే, నాయకులపై ఆరోపణల పర్వం ఆగ్రహావేశాలకు దారితీసింది. సవాళ్లు, ప్రతి సవాళ్లను విసురుకున్నారు. ఇదంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ సాక్షిగా జరడం గమనార్హం. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్..వాటిని నుంచి బయటపడేందుకు ప్రయత్నించటం లేదని ఆ వర్గాలు అంటున్నాయి.
వార్‌రూమ్‌లో భట్టికి చుక్కలు
మాజీ మంత్రి ఈటలను పార్టీలో చేర్చుకోకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని అధిష్టానం భావిస్తున్నది. ఈటల పార్టీలో చేరకుండా ఆనాడు కొంత మందినాయకులు అడ్డుకున్నారంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పబోతుండగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకొని.. ఈటల చేరికను వ్యతిరేకిస్తున్నట్టు ఆనాడు నాతో మీరే చెప్పారు కదా? అంటూ భట్టికి వార్‌రూమ్‌లో చుక్కలు చూపించారు. ఆ విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ఇప్పుడు దానిని ఇతరులపై నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. విక్రమార్కను రాష్ట్రనాయకత్వం ముందు నిలదీయడంతో చాలా ఇబ్బందిపడినట్టు తెలిసింది. ఈటలను చేర్చుకునే విషయంలో తాత్సారం చేయడం, రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా వచ్చాయని అన్నట్టు సమాచారం. అతనిని పార్టీలో చేర్చుకుంటే నేడు పరిస్థితి మరోలా ఉండేదని వివరించారు. ఉప ఎన్నికలకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్ధులు ముందుగా ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో నిర్లక్ష్యం, ఎంపికలో ఆలస్యం, ధన ప్రభావం, అన్నింటికీ మించి ఈటలను పార్టీలోకి తీసుకురావడంలో పార్టీ తీవ్రమైన నష్టం చవిచూసిందని అధిష్టానం గరమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ మౌనంగానే ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
పాడి కౌశిక్‌రెడ్డి పార్టీ మారడంలో ఉత్తమ్ హస్తం
హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి కారెక్కేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారణమంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనడంతో వార్‌రూమ్ మరింత వేడెక్కింది. ఉపఎన్నిక ఫలితాలకు, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదని పొన్నం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కారు నడిపిన వ్యక్తి... ఇప్పుడు వేరే పార్టీలో ఉండటానికి కారకులెవరో అందరికీ తెలుసంటూ అనడంతో పొన్నంపై ఉత్తమ్ విరుచు పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య పరస్పర ఆవేశా లకు దారితీశాయి. ఉత్తమ్ పరుష పదజాలం ఉపయోగిం చడంతో పొన్నం అందుకు ధీటుగా బదులిచ్చారు. ఫలితంగా ఒక్కసారిగా వార్ రూమ్ పరిస్థితి వేడెక్కింది. కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ జోక్యం చేసుకొని పరిస్థితిని శాంతింపజేశారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఎలాంటి స్పష్టత లేకుండానే ముగిసిందని ఒక నాయకుడు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికార టీఆర్ఎస్ కోవర్డులు ఉన్నారంటూ ఒకరిద్దరూ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించే అవ కాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ఇదిలావుండగా.. ఢిల్లీలో జరిగే సమీక్షా సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థి వెంకట్‌ను బలిపశువును చేశారని తాను ఆనాడే చెప్పానని.. అది ఇప్పుడు నిజమైందని విలేక రుల సమావేశంలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, భట్టి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వి హనుమంతరావు, దామోదర రాజనర సింహ, షబ్బీర్‌అలీ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, అభ్యర్థి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు : ఠాగూర్
ప్రధాన మంత్రి మోడీ, హౌంమంత్రి అమిత్‌షా ఎదుట సీఎం కేసీఆర్ మోకరిల్లుతున్నారని మాణిక్యంఠాగూర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొందనీ, వాటన్నింటిని అధిగమించిందన్నారు. బీజేపీకి, టీఆర్ఎస్ బీ టీమ్‌గా మారిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే నైతికహక్కులేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆ రెండు పార్టీలు చేస్తున్న ధర్నాలు మ్యాచ్‌ఫిక్సింగ్ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కొంటాయా? అని ప్రశ్నించారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేశవరావు, డి శ్రీనివాస్ టీఆర్ఎస్కు కోవర్టులుగా వ్యవహరించి, ఆ తర్వాత రాజ్యసభ సభ్యులయ్యారని పొన్నం ప్రభాకర్ చెప్పారు.