Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపు
- ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సతమతం
- పీఆర్సీ వర్తింపచేయని సర్కారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్కేసీ) కాంట్రాక్టు ఫుల్‌టైం మెంటార్స్ 18 నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే కరోనా కష్టకాలం. ప్రతినెలా జీతం వస్తేనే కుటుంబ అవసరాలు తీరడం లేదు. అలాంటిది 2020, మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే 18 నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 59 మంది మెంటార్స్ పనిచేస్తున్నారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.17,500 వేతనం ప్రభుత్వం చెల్లిస్తున్నది. తక్కువ జీతమైనా ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందోనని కండ్లు కాయలు కాసేలా వారు ఎదురుచూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కొందరు మెంటార్స్‌కు బస్సు ఛార్జీలకూ, పెట్రోల్ వాడేందుకూ డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక సకాలంలో జీతాలు రాకపోవడంతో వారికి కుటుంబాల పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇంటిఅద్దె, కుటుంబాల పోషణ, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీకి డబ్బులు తెచ్చి ప్రతినెలా నెట్టుకొస్తున్నారు. 2020, మార్చి వరకు 67 మంది మెంటార్స్ పనిచేసే వారు. సకాలంలో జీతాలివ్వకపోవడంతో ప్రస్తుతం 59 మంది పనిచేస్తున్నారు. ప్రతినెలా జీతాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
30 శాతం ఫిట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం
'రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వేతన సవరణ చేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఇతర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు, విద్యావాలంటీర్లు, వీఆర్ఏలు, వీఏవోలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు కలిపి మొత్తం 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించింది.'అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కానీ టీఎస్కేసీలో పనిచేస్తున్న మెంటార్స్‌కు మాత్రం పీఆర్సీ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదు. దీంతో 30 శాతం ఫిట్మెంట్ వారికి వర్తించడం లేదు. ప్రస్తుతం వారి జీతం రూ.17,500 వస్తున్నది. 30 శాతం ఫిట్మెంట్ వర్తింపచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే వారి జీతం రూ.22,750కి పెరగనుంది. అయితే డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా రూ.58,850 లేదంటే జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులిచ్చే రూ.54,220 జీతం చెల్లించాలని టీఎస్కేసీ మెంటార్స్ డిమాండ్ చేస్తున్నారు. అలా వీలుకాకపోతే డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్/డాటా ఎంట్రీ ఆపరేటర్ మూలవేతనం రూ.31,040 జీతం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
జీతాలివ్వండి : మంత్రి హరీశ్‌రావుకు వినతి
రాష్ట్రంలో 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల టీఎస్కేసీ కాంట్రాక్టు ఫుల్‌టైం మెంటార్స్ సంఘం కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షులు రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ కిశోర్‌కుమార్, నాయకులు రాజశేఖర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. 2006-07 విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ (జేకేసీ)లను నాటి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. 2016-17 విద్యాసంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం టీఎస్కేసీగా మార్చిందని వివరించారు. 2019 వరకు తమకు రూ.8 వేలు మాత్రమే జీతం చెల్లించారని పేర్కొన్నారు. 2019, మార్చిలో రూ.17,500కు వేతనం పెరిగిందని తెలిపారు. 2020, ఫిబ్రవరి వరకు జీతాలు చెల్లించారని పేర్కొన్నారు. 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.