Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రి ఎదుట గ్రామస్తులు బైటాయింపు
నవతెలంగాణ-బిచ్కుంద
ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి 24 గంటల పాటూ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆదివారం బైటాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద కొడప్గల్ మండల ప్రజలకు సేవలు అందించేందుకు ఆస్పత్రి నిర్మించినా.. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రానికి చెందిన సాయిలు, లక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనంపై వస్తూ బేగంపూర్ గేట్ వద్ద రోడ్డుపైన ఉన్న వరి కుప్పలను ఢకొీని గాయపడగా చికిత్స నిమిత్తం పెద్ద కొడప్గల్ ఆస్పత్రికి తరలించగా సిబ్బంది అందుబాటులో లేదని తెలిపారు. దాంతో నైట్ వాచ్మెన్ గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేశాడన్నారు. వైద్యులు లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించి బాన్సువాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా సిబ్బంది లేక మెరుగైన చికిత్స అందడం లేదనీ, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. జిల్లా అధికారులు పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన చికిత్సలు అందే విధంగా చూడాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్‌కు, జిల్లా వైద్య అధికారికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.