Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేరోస్ సైకిల్ యాత్ర ముగింపు సభలో ప్రవీణ్ కుమార్
- జోడేఘాట్లో భీం సమాధి వద్ద నివాళులు
నవతెలంగాణ-కెరమెరి
ప్రగతి భవన్పై నీలి జెండా ఎగిరేస్తామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గత నెల 9న స్వేరోస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప యాత్ర ఆదివారం కొమురం భీం జిల్లా కెరమేరిలో ముగిసింది. ఈ సందర్భంగా స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వేరోస్ విద్యార్థి నాయకులు 37 రోజులుగా బహుజన సంకల్ప యాత్ర చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. బహుజనులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే రాష్ట్రంలోని పేదల సమస్యలు తీరుతాయని స్పష్టం చేశారు. 25 ఏండ్ల కిందట ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయనీ, మారుమూల గ్రామాల్లో సరైన రోడ్లు, వంతెనలు నిర్మించలేదనీ, సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. రోజురోజుకూ రాష్ట్రంలో దళిత, గిరిజనులు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దోపిడీదారులు, దళారుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా బహుజన సంకల్ప యాత్రలను చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో మడమ తిప్పేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, రేవంత్, బండి సంజరు వంటి నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పని చేసి మన చరిత్రను మనమే రాసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్, కాన్షీరాం మహనీయులు కన్న కలలు సాకారం చేయాలంటే బహుజనుల చేతుల్లోకి అధికారం రావాలన్నారు. అంతకుముందు మండలకేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి, జోడేఘాట్లో భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తిరుమల, స్థానిక నాయకులు మిలింద్, శివాజీ పాల్గొన్నారు.