Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌తో పోలీసులు అప్రమత్తం
- మారుమూల ప్రాంతాలకు వెళ్లరాదంటూ హెచ్చరిక
- రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు మారుమూల ప్రాంతాలకు ప్రజాప్రతినిధులు, వీఐపీలు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. గడ్చిరోలి జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది వరకు మావోయిస్టులు మరణించగా, మహారాష్ట్ర స్పెషల్ పార్టీకి చెందిన నలుగురు పోలీసు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే, మావోయిస్టుల తరఫున మరికొందరికి బుల్లెట్ గాయాలయ్యాయయనీ, వారు ప్రాణాపాయ స్థితిలో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన మావోయిస్టుల్లో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు పలువురు డివిజనల్ కమిటీ సభ్యులు, డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులు ఉండటంతో ఈ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టాన్ని మిగిల్చిందని తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈఎన్కౌంటర్పై స్పందించిన మావోయిస్టు పార్టీ ఏకపక్షంగా కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్‌గా మార్చారనీ, దీనిపై న్యాయవిచారణ జరపా లని డిమాండ్ చేయడమేగాక ఇందుకు రెట్టింపు స్థాయిలో ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ప్రకటించింది. ముఖ్యంగా, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా కుట్రపన్ని ఈ ఎన్కౌంటర్ జరిపారని ఆరోపిం చింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా ముందస్తు అను మతులు లేకుండా ప్రజాప్రతినిధులెవ్వరూ మారుమూల ప్రాంతాలకు పోకూ డదని హెచ్చరించారు. మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న పోలీసు అధికారులు సైతం అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అలాగే, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ దళాలు సీఆర్పీఎఫ్ బలగాలతో కలిపి కూంబింగ్ ఆపరేషన్‌ను ఉధృతం చేశాయి. గడ్చిరోలిలో ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టులనేకమంది తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించడంతో సరిహద్దు మార్గాలను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయని తెలిసింది.