Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై రేవంత్ ఆగ్రహం
- అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహం వద్ద నివాళులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. నాటి చరిత్రను నేటి యువతకు తప్పుగా చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి ఈ దేశ ప్రజలకు పెద్ద పండుగ అని పేర్కొన్నారు. తొలి ప్రధాని నెహ్రు జయంతిని పుర్కరించుకుని అబిడ్స్‌లో ఆయన విగ్రహం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రంలో ఎలాంటి పాత్ర లేనివారిని బీజేపీ దేశభక్తులుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదనీ, వాయిదా వేశామని స్పష్టం చేశారు. కలెక్టర్లు రాజకీయ అవతారం ఎత్తారనీ, టీఆర్ఎస్ ధర్నాలకు అనుమతిచ్చి...కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు తమ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వర్తించవా? అని ప్రశ్నించారు. బీజేపీ, టీిఆర్‌ఎస్ నేతలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. వడ్లు కొనేందుకు రూ.10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదనీ, ఢిల్లీ జంతర్ మంతర్‌లో సీఎం ఎందుకు దీక్ష చేయలేదని నిలదీశారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతి ధాన్యపు గింజా కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం పోరాటం వల్ల రాలేదనీ, భిక్ష అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై భట్టి ఖండించారు. ఇది భిక్ష కాదనీ, ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగమని వివరించారు. దేశం బలంగా నిర్మాణమవ్వడానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. హుజురాబాద్ సమీక్ష చాలా అర్ధవంతంగా జరిగిందనీ, ఇవాళ వచ్చిన ఏ కథనం కూడా నిజం కాదనీ, సమావేశం తర్వాత తాము చెప్పిందే వాస్తవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు హర్కరవేణుగోపాల్, సునీతారావు, కుమార్‌రావు, బొల్లు కిషన్, అనిల్‌యాదవ్, మెట్టుసాయి తదితరులు ఉన్నారు.