Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 నుంచి 23 వరకు ఉమ్మడి జిల్లా సదస్సులు
- కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
- మద్దతు ధరతో ధాన్యం కొనాలి : ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీలో రైతాంగ పోరాటానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో 24 గంటల ధర్నాను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆదివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టీ సాగర్, వేములపల్లి వెంకట్రామయ్య, పశ్యపద్మ, కెచ్చల రంగయ్య, బి ప్రసాద్, పల్లపు ఉపేందర్‌రెడ్డి, అచ్యుత రామారావు, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్య మాట్లాడారు. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో రైతు, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పై డిమాండ్లతో పాటు రాష్ట్రంలో వరి కొనుగోళ్ళు, పోడు రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 17 నుంచి 23 వరకు ఉమ్మడి జిల్లా సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వరి కొనుగోళ్ళ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, రైతుల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయని విమర్శించారు. వానాకాలం వరి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదనీ. వాటి సంఖ్యను పెంచి, కనీస సౌకర్యాలు కల్పిస్తూ, మద్దతు ధర సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగానే యాసంగిలో వచ్చే వరిని కొనుగోలు చేయబోమని ప్రకటిస్తున్నదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో జరిగే ఈ ఆందోళనలకు రాష్ట్రంలోని కార్మిక, విద్యార్థి, యువజన, మేధావి, మహిళ, సామాజిక, గిరిజన, మైనార్టీ సంఘాలతో పాటు రాజకీయపార్టీలు కూడా మద్దతు తెలుపుతూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.