Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయకుండా యథాతధంగా ఉంచాలి :ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జనార్డన్రెడ్డి, అధ్యక్షులు కె వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం కోసం సర్వీస్ రూల్స్, నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వం వేసిన కమిటీ తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం వారి కోసం ప్రత్యేక శాఖ ఉండాలని సూచిస్తుందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. వికలాంగుల శాఖలో పని చేస్తున్న ఉద్యోగులను మహిళా శాఖలో విలీనంకై నియమాలు, విధానాలు మార్పుకై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందనీ, ఈ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.