Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాలను తక్కువ చూపెట్టిన రాష్ట్ర సర్కార్
- రాష్ట్రంలో నిర్ధారించింది 3,741 మాత్రమే
- పక్కరాష్ట్రాల్లో వేలల్లో..
- డెత్ సర్టిఫికెట్ల కోసం బాధిత కుటుంబాల ఇక్కట్లు
కరోనా తీవ్రత తక్కువ ఉందని చూపెట్టే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు గొప్పలకు పోయి తక్కువ మరణాలు చూపెట్టింది. రాష్ట్రంలో అధికారికంగా నిర్ధారించిన కరోనా చావులు శుక్రవారం వరకు 3,741మాత్రమే. ఇతర రోగాలను చూపెట్టి..వాటివల్లే చనిపోయినట్టు చిత్రీకరించి లెక్కలు తక్కువ చేసి చూపిందనే విమర్శ ఉంది. ఇప్పుడు ఇదే రాష్ట్ర సర్కారుకు పెద్ద చిక్కుగా మారబోతున్నది. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది చనిపోయిన వారి కరోనా డెత్ సర్టిఫికెట్లే లేవు. వీరు ఇప్పుడు వాటి కోసం తిప్పలు పడుతున్నారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటంతో మరోసారి కరోనా మరణాల సంఖ్యపై చర్చ మొదలైంది.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళ నాడు, కేరళలో వేలాది మంది మరణించినట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందనే చర్చా ఉంది. మన రాష్ట్రంలో మాత్రం 3,741 అని మాత్రమే టీఆర్ఎస్ సర్కారు చూపెట్టింది. శ్మశాన వాటికల్లో రోజువారీగా కాలుతున్న శవాలను సంఖ్యను బట్టి రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనాతో చనిపోయి నప్పటికీ ఇతర రోగాల కారణంగా చనిపోయి నట్టు మభ్యపెడుతున్నది. దీంతో కరోనా మరణాలు మరుగునపడిపోయాయి. అందుకే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కోవిడ్-19తో మరణించిన వారి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తున్నది. మొదటి నుంచీ మీడియా బులెటిన్లో చాలా తక్కువగా చూపిందనే విమర్శలూ బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నష్టపరిహారం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను రాష్ట్ర సర్కారు ఇది వరకే విడుదల చేసింది. అయితే దరఖాస్తుదారులు తప్పనిసరిగా కోవిడ్-19తో చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ చూపెట్టాలి. ఇతర రోగాలుండి కరోనాతో చనిపోయినప్పటికీ..కోవిడ్-19కింద ఆ మరణాలను రాష్ట్ర సర్కారు చూపెట్టలేదు. డెత్సర్టిపికెట్లు కరోనాతో చనిపోయినట్టు ఇవ్వలేదు. అయితే, కరోనా సోకినట్టు బాధిత కుటుంబాల వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయి. నల్లగొండ జిల్లా చండూరుమండలం గట్టుప్పల్కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్డు దొరకలేదు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చినప్పటికీ పరిస్థితి విషమించి చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం డెత్సర్టిఫికెట్ కోసం మీసేవ చుట్టూ తిరుగుతున్నది. అదే సమయంలో కరోనాతో మరణించిన వారిలో ఆస్పత్రిలో చేరిన వారితో పాటు ఇంటి వద్దనే ఐసోలేషన్ కొనసాగించిన వారు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో మరణించిన వారి విషయంలోనూ రాష్ట్రంలో అందరికీ కరోనాతో మరణించినట్టుగా సర్టిఫికెట్లను ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇతర వ్యాధులు కలిగి కరోనా సోకి మరణించిన వారి విషయంలో ఆ చావుకు కారణం (కాజ్ ఆఫ్ డెత్)ను ప్రత్యేక కమిటీ నిర్ధారించింది. వారు ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాటిని కరోనా మరణంగా కలెక్టర్ ధ్రువీకరిస్తేనే వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందుతుంది. కానీ, రాష్ట్ర సర్కారు ఇలాంటి వాటిని కరోనా మరణాలు చూపెట్టదనే విమర్శ అప్పుడే బయలుదేరింది. ఒకవేళ గుర్తిస్తే కరోనా మరణాల విషయంలో తప్పు చేసినట్టు అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి అలా చేసే అవకాశం లేదు. రాష్ట్ర సర్కారు గొప్పలకు పోవడం ఇప్పుడు బాధిత కుటుంబాలకు అందే అరకొర సహాయం కూడా అందని దుస్థితి నెలకొంది.
ప్రభుత్వం గొప్పలకు పోయి కరోనాను కట్టడి చేశామని చెప్పుకునేందుకు కప్పేసిన మరణాల సంఖ్యతో బాధితుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోవిడ్ డెత్ ఆడిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
'రాష్ట్రంలో కరోనాతో ఒక లక్షా 20 వేల మంది మరణించినట్టు సమాచారముంటే ప్రభుత్వం కేవలం 3,912 మంది మాత్రమే మరణించారని చెబుతున్నది' అని పిల్లో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా కాలంలో మరణించిన వారిని గుర్తించి ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని దాసోజు శ్రవణ్ అందులో డిమాండ్ చేశారు.