Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహణ : ఆహ్వాన కమిటీ చైర్మెన్, వైస్చైర్మెన్లు చుక్కరాములు, ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఆహ్వాన కమిటీ చైర్మెన్ చుక్కరాములు, వైస్ చైర్మెన్ ఎం.సాయిబాబు తెలిపారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో గల ఎస్వీకేలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరిట దేశ సంపదను, వనరులను మోడీ సర్కారు కార్పొరేట్ల పరం చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి రంగం దెబ్బతినడంతో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. హైర్ అండ్ పైర్ విధానంతో కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను కార్మికులపై రుద్దాలని చూడటం దారుణమని విమర్శించారు. కీలకమైన విద్యుత్‌ను పూర్తిగా ప్రయివేటీకరించే కుట్ర జరుగుతున్నదని తెలిపారు. కార్మికులు పోగేసుకున్న డబ్బులను నూతన పెన్షన్ విధానంతో ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రకు బీజేపీ పూనుకున్నదని వివరించారు. మోడీ సర్కారు వేగంగా అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా దేశ ఆర్ధిక వ్యవస్థకు, స్వావలంబనకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కోడ్లతో సామాజిక, ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదముందన్నారు. ఐక్యతా పోరాట నినాదాన్ని తీసుకుని సీఐటీయూ ముందుకు వెళ్తున్నదన్నారు. రైతాంగ, ఇతర రంగాల్లోనూ జరుగుతున్న పోరాటాలకు బాసటగా నిలుస్తామన్నారు. మోడీ విధానాలనే రాష్ట్ర సర్కారూ అమలు చేస్తున్నదనీ, ఫలితంగా సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. దేశ ఆర్థిక స్థితిని, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన ఉద్యమాలపై ప్రధానంగా కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశాలు సీఐటీయూ అంతర్గత విషయం కాదనీ, దేశంలోని కార్మికులకు న్యాయం జరగాలని కొట్లాడేందుకు అవి దోహదపడుతాయని చెప్పారు. ఆహ్వాన సంఘం కోశాధికారి ఎ.నాగేశ్వర్రావు మాట్లాడుతూ..సమావేశాల నిర్వహణకు 18 కమిటీలు వేశామని చెప్పారు. వీటి నిర్వహణ కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎస్వీ రమ, పాలడుగు భాస్కర్, మధు, ఉపాధ్యక్షులు ఆర్. కోటంరాజు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
లక్ష రూపాయల సహాయం అందజేసిన తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్
జాతీయ కౌన్సిల్ సమావేశాల నిర్వహణకుగానూ తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయా న్ని ప్రకటించింది. దానికి సంబం ధించిన చెక్కును ఆహ్వాన సంఘం చైర్మెన్ చుక్కరాములు, వైస్ చైర్మెన్ ఎం.సాయిబాబులకు ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.సుధాకర్ అందజేశారు.