Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోనస్ ఇవ్వాలి... తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యామ్నాయ పంటలను కొనే గ్యారెంటి ఇవ్వాలనీ, కేరళ తరహా బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మద్దతు ధరలు లేని ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలు గ్యారెంటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలుగా యాసంగిలో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేసింది. కానీ ఇందులో ఆవాలు, ఆముదం పంటలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర జాబితాలో లేవు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. ప్రభుత్వం వేసిన దిగుబడి అంచనాలు వచ్చే విధంగా వ్యవసాయ శాఖ ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలో నిర్థిష్టంగా పేర్కొనాలి. అంతే కాని రైతుల అభిప్రాయానికి వదిలిపెడితే ఆ భూసారన్ని బట్టి కాకుండా రైతులు తమకు తోచిన పంటలు వేస్తారు. దిగుబడులు దెబ్బతిని నష్టపోతారు. అందువల్ల భూసారాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వం ఆ మండలాలకు, ప్రాంతాలకు తగు పంటలను కేటాయించాలి. వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి రైతులకు విత్తనాలు, ఎరువులు, తగు సలహాలు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు ఈ పంటలకు కల్తీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోయారు. రానున్న యాసంగిలో రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ సంస్థల నుంచే సరఫరా చేయాలి. పంట పండిన తరువాత వరిలాగా కొనుగోలుకు ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలి. గతంలో ఈ పంటలను ఏనాడు కేంద్రం సేకరించలేదు. పండిన తరువాత తిరిగి కేంద్రంపైకి కొనుగోలుకు నెట్టకుండా రాష్ట్రం ప్రాసెసింగ్ చేసి రాష్ట్ర అవసరాలుపోను మిగిలినవి ఎగుమతులు చేయాలి. వంట నూనెలు, పప్పులు దిగుమతులు చేసుకుంటు న్నాము. దిగుమతులు తగ్గటంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా కొనుగోలు గ్యారెంటి అవసరం. ఏఇఓలను అప్రమత్తం చేసి రైతులకు సలహాలు ఇచ్చే విధంగా చూడాలి. యాసంగి పంట రుణాలను రైతులకు సకాలంలో అందించాలని సాగర్ కోరారు. ఈ చర్యలు చేపట్టినప్పుడే ప్రత్యామ్నాయ పంటల విధానం జయప్రదం అవుతుందని'' సాగర్ సూచించారు. వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో పెట్టాలని విజ్ఞప్తి చేశారు.