Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 20 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్లేబర్కు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం(సీఐటీయూ) విజ్ఞప్తి చేసింది. స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మాతాబ్ శ్రీభర్తృహరి, సభ్యులు సోమవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. సీఐటీయూ నేతలు ఆ బృందాన్ని కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. కోటంరాజు తదితరులు ఉన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విన్నవించారు. మైన్స్ ప్రమాదంలో, కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా ఆదేశం ప్రకారం చెల్లించాల్సిన రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వట్లేదనే విషయాన్ని వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్ కార్మికులకు జెబీసీసీఐలో వేతనాలు నిర్ణయించారనీ, వాటిని కోల్ ఇండియాలో 2013 నుంచి అమలు చేస్తున్నప్పటికీ సింగరేణిలో మాత్రం చేయటం లేదని వాపోయారు. కోల్ ఇండియాలో రోజుకు రూ.950 చెల్లిస్తుంటే, సింగరేణిలో మాత్రం రూ.437 మాత్రమే ఇస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మట్టి తొలగింపు పనిలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయిస్తున్నారని తెలిపారు. వారి బాగోగులు మాత్రం పట్టించుకోవడంలేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి - సమాన వేతనం చెల్లించడంలేదని వివరించారు. కన్వేయన్స్ డ్రైవర్స్‌కు స్కిల్డ్ వేతనాలు చెల్లించడం లేదని, సిఎంపిఎఫ్ అమలు చేయడం లేదని వారికి విన్నవించారు. వినతిపత్రంపై స్పందించిన చైర్మన్, కమిటీ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి కషి చేస్తామనీ, అవసరమైతే సింగరేణి నుంచి ప్రత్యేకంగా డీల్ చేస్తామని హామీ ఇచ్చారు.