Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్లను యధాతథంగా కొనసాగించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోల విలీనం చేయొద్దనీ, ఐసీడీఎస్ కేంద్రాలను యధాతథంగా కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు ఇదే అంశంపై ఆ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్.త్రివేణి, సహాయ కార్యదర్శి జి.కవిత, ఉపాధ్యక్షులు ఇ.వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో కలిపే ప్రయత్నాన్ని చేశారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. రూ.40 కోట్ల అద్దె భారం తగ్గుతుందనే సాకుతో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చూడటం దారుణమని విమర్శించారు. అంగన్వాడీలు నిరసనలు తెలిపారని వేతనాలు కట్ చేసే అప్రజాస్వామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన పీఆర్సీ వేతనాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సూపర్వైజర్ల పరీక్షల నిర్వహణ తేదీన వెంటనే ప్రకటించాలని విన్నవించారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించి ఆ కేంద్రాల్లో ఆయాలను నియమించాలని కోరారు. కేంద్రం పెంచిన వేతనాలను 2018 అక్టోబర్ నుంచి తక్షమే ఇవ్వాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.