Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 కోట్ల 8 లక్షల గంజాయి పట్టివేత
- ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు సరఫరా..
- 1240 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆటో స్వాధీనం
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్
నవతెలంగాణ-హయత్‌నగర్
అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను ఇంటెలిజెన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిషేధిత నార్కోటిక్, గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్లోని క్యాంప్ ఆఫీసులో రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేష్ మురళీధర్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీలో భాగంగా ఇన్నోవా కారును పోలీసులు ఆపారు. అందులోనివారు ఇచ్చిన సమాచారంతో అక్కడే ఉన్న టాటా ఏసీ, ఇండికా వాహనాలను తనిఖీ చేసి నార్కోటిక్, గంజాయిని గుర్తించారు. షేక్ యాసిన్ ఆధ్వర్యంలో ఈ గంజాయి దందా నడుస్తోందని, ఆటో గ్యారేజ్‌లో గంజాయిని ప్యాకింగ్ చేయిస్తూ ముంబాయికి తరలిస్తున్నారని తెలిసింది. నాచారానికి చెందిన యాసిన్, మంద మధు అలియాస్ బాబు, బోడుప్పల్‌కు చెందిన తన్నీరు సంతోష్ అలియాస్ సన్నీ, అదే ప్రాంతానికి చెందిన సుగుర వాసుదేవరెడ్డి అలియాస్ వాసు, పొన్నం రాజేశ్వర్, కీసరకు చెందిన చుంచు రవీందర్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు 2016లో కూడా హయతగర్లో 2వేల కేజీల గంజాయి స్మగ్లింగ్ చేశారు. ప్రస్తుతం పెద్దమొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది. 1240 కిలోల గంజాయిని, రెండు కార్లను, ఆటోను, రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.2 కోట్ల, 8 లక్షల 5వేలు ఉంటుంది. ఏపీ రాష్ట్రం సీలేరు నుంచి గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ప్రధాన నిందితుడు షేక్ యాసిన్‌తోపాటు రవీందర్, మధు పరారీలో ఉన్నారు. ప్రెస్మీట్లో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఎస్వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎస్ఐ అవినాష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.