Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యం వచ్చేసింది
- రెండో డోస్ తీసుకునేందుకు ముందుకురాని వైనం
- అవగాహన కల్పించని సర్కారు
- ఆసక్తి చూపని అధికారగణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా లేదు...గిరోనా లేదు. సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ప్రజలు ఫంక్షన్లు, శుభకార్యాలు చేసుకుంటున్నారు. గుంపులు, గంపులుగా గుమిగూడుతున్నారు. అంతా ఏమవుతుందిలే...అనుకుంటున్నారు. కరోనాకు విరుగుడుగా ఒక డోసు తీసుకున్నాముగా....అని సరిపెట్టుకుంటున్నారు. రెండో డోసు గడువు అయిపోయాక కూడా రేపు, మాపు అనుకుంటూ ....వాయిదాలతో గడిపేస్తున్నారు. మరికొంత మంది అమ్మో వ్యాక్సిన్ అంటూ ఇప్పటికీ భయపడి ముందుకు రావటం లేదు. కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినా పూర్తిగా కనుమరుగు కాకపోగా, గత నెల రోజులకు పైగా ప్రతి రోజు దాదాపు ఒకే రీతిగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారమే...ప్రతి రోజూ ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు డోసులు కూడా సరిపోవేమో ...బూస్టర్ డోసు అవసరముంటుందేమోనని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే రాష్ట్రంలో కనీసం ఒక్క డోసు కూడా తీసుకోనివారు లక్షల సంఖ్యలో మిగిలి ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో 18 ఏండ్లపై బడ్డ 2.77 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదటగా వైద్యారోగ్యశాఖ సిబ్బందితో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లను, 45 ఏండ్లుపై బడ్డ వారినీ, 18 ఏండ్ల నుంచి 44 ఏండ్లలోపు వారిని ప్రాధాన్యతా క్రమంలో చేరుస్తూ వచ్చారు. 10 నెలలు గడుస్తున్నా...మొదటి ప్రాధాన్యతగా గుర్తించిన వైద్యారోగ్యశాఖ సిబ్బందికీ కూడా మొదటి డోసు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. నవంబర్ 10న విడుదల చేసిన కరోనా వ్యాక్సినేషన్ బులెటిన్ ప్రకారం....తాజాగా ఆ శాఖకు చెందిన ఎనిమిది మంది మొదటి డోసు తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల కేటగిరీలో మరో ఎనిమిది మంది తీసుకున్నారు. మొత్తంగా 2.33 కోట్ల మందికి మొదటి డోసు వేయగా, 1.06 కోట్ల మందికి రెండో డోసు కూడా తీసుకున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఇంకా 44 లక్షల మందికి ఫస్ట్ డోసు, 1.71 కోట్ల మందికి రెండోది ఇవ్వాల్సి ఉన్నది. రెండో డోసు వారిలో దాదాపు 18 లక్షల మంది వరకు గడువు తీరినా తీసుకోలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆసక్తి చూపించటం లేదు...
ఇంటింటికీ వ్యాక్సిన్ వేస్తున్నా ప్రజలు తీసుకునేందుకు ఆసక్తి చూపించటం లేదని అధికారులు వారిపై నెపం నెడుతున్నారు. తగినంత శాస్త్రీయ ప్రచారం చేయటంలో నిర్లక్ష్యం మాత్రం కనిపిస్తున్నది. ఒకవైపు వ్యాక్సిన్ వేస్తూనే, వైద్యారోగ్యశాఖలోనే క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించటం భారంగా మారుతున్నది. కరోనాకు వ్యాక్సినేషన్ తీసుకోవటం ఎంత తప్పనిసరి అనే దానిపై ప్రచార విభాగాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల నిర్లక్ష్యాన్ని తక్కువగా అంచనా వేయలేమనీ, సీరియస్ గా వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరముందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ ప్రజల్లో వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందనీ, దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతింటాయని ...ఇలా రకరకాల అపోహలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆ ఊసేత్తడం లేదు.