Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహణ
- హాజరుకానున్న 425 మంది ప్రతినిధులు
- ఆకట్టుకుంటున్న ఎర్రతోరణాలు, జెండాలు
- సమావేశాల నిర్వహణకు 18 కమిటీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఇవి గురువారం వరకు కొనసాగనున్నాయి. దేశ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు పాలన సాగుతున్న క్లిష్టపరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశాలు భవిష్యత్ పోరాటాల రూపకల్పనకు దిక్సూచిగా నిలవనున్నాయి.
సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన కూడళ్లను సీఐటీయూ తోరణాలతో అలంకరించారు. ఎర్రజెండాలు కట్టారు. రెండేండ్లలో సీఐటీయూ చేసిన పోరాటాలకు సంబంధించి ఓపెన్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎస్వీకే వద్ద ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్ఐ, తదితర సంఘాల బ్యానర్లను కట్టారు. ఈ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు భోజనం, హాల్ నిర్వహణ, వసతికల్పన, పబ్లిసిటీ, మెడికల్ క్యాంపు, సోషల్‌మీడియా, ట్రాన్స్‌పోర్టు, సెమినార్ల నిర్వహణ, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆహ్వానించేందుకు, వాలంటీర్లు, ఆర్థిక అంశాలు, రిసెప్షన్, తదితరాల కోసం 20 సబ్ కమిటీలను వేశారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, చైర్మెన్ చుక్కరాములు, వైస్‌చైర్మెన్ ఎం.సాయిబాబు, జనరల్ సెక్రటరీ జె.వెంకటేశ్, ట్రెజరర్ ఎ.నాగేశ్వర్రావు, సబ్కమిటీల కన్వీనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కౌన్సిల్లో పాల్గొనే 425 మంది ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఉదయం 10 గంటలకు సీఐటీయూ జెండాను ఆవిష్కరణ తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఐక్యపోరాటాల రూపకల్పన ఎలా చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. కార్మికకోడ్ల వల్ల భవిష్యత్‌లో జరుగబోయే నష్టాన్ని తెలుపుతూ వాటి రద్దు కోసం కార్మికులను పోరాటాల్లోకి రప్పించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగబోయే పెనుప్రమాదం దానిపై భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించనున్నారు. కార్మిక, కర్షక మైత్రిని క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేందుకు చేయాల్సిన కృషిపై కసరత్తు చేయనున్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులతో కలిసి ఐక్యంగా చేయాల్సిన పోరాటాలపై చర్చించనున్నారు. ఇతర రంగాల్లోనూ జరుగుతున్న పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ వాటిని ముందుకు నడిపించడంలో సీఐటీయూ పోషించాల్సిన పాత్రపై సమావేశాల్లో మాట్లాడనున్నారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం మన దేశంపై ఏవిధంగా పడుతున్నది? 2020 జనవరిలో చెన్నైలో జరిగిన సీఐటీయూ అఖిల భారత మహాసభ నుంచి నేటి వరకు చేసిన కార్యక్రమాలపై సమీక్షించుకోనున్నారు. కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారికి సీఐటీయూ ఏవిధంగా అండగా నిలిచింది? వలస కార్మిక చట్టాలను అమలు కోసం కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైన పోరాటాల కార్యాచరణను రూపొందించనున్నారు. మోడీ సర్కారు వ్యతిరేక విధానాలను నిరసించేందుకు భవిష్యత్‌లో ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని చేయాల్సిన ఐక్యపోరాటాల ఆవశ్యకత మీద చర్చించి కార్యాచరణను ఆమోదించనున్నారు. పలు కీలకమైన అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.