Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతులెత్తేసిన ఐకేపీ నిర్వాహకులు
- ధాన్యం కుప్పలతో వెంకట్రావ్పల్లిలో అన్నదాతల రాస్తారోకో.. హాజీపూర్లోనూ ఆందోళన
నవతెలంగాణ - ముస్తాబాద్/ హాజీపూర్
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవ డంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రోజూ ఆందోళనలు చేస్తున్నా పాలకులకు పట్టడం లేదు. మొదట తేమ ఎక్కువ ఉందని.. తరువాత అతిగా ఎండాయని ధాన్యం కొనేందుకు ఐకేపీ నిర్వాహకులు నిరాకరించడంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావ్పల్లి గ్రామ రైతులు సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం కుప్పలు పోసి ధర్నాకు దిగారు. వెంకట్రావుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని నెల రోజుల కిందట ఏర్పాటు చేశారు. రైతులంతా ధాన్యం తీసుకొచ్చి సెంటర్లో పోశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడంతో నెల రోజులుగా ఎండలో ఆరబోశారు. ప్రస్తుతం అతిగా ఎండాయని రైస్ మిల్కు పంపిస్తే బియ్యం కన్నా నూకలే ఎక్కువగా వస్తాయి.. కొనుగోలు చేయడం కుదరదని చెప్పారు. దీంతో ఆగ్రహిం చిన రైతులు ''మీరు చెబితేనే ఆరబోశాం.. ఇప్పుడేమో కొనేది లేదంటే ఎలా'' అని ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తాము ఏం చేయలేమని, రైస్మిల్లర్స్తో మాట్లాడుకోండి.. ఈ సెంటర్ను నడిపించడం మాతో కాదు రాజీనామా చేస్తున్నామని చేతులెత్తేశారు. దాంతో రైతులు సిరిసిల్ల - కామారారెడ్డి రహదారిపై ధాన్యం కుప్పలతో ధర్నా చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని రైస్ మిల్లర్లతో మాట్లాడి.. ధాన్యం కొనుగోళ్లకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో..
ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని రైతులు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగిలో వరి సాగు వద్దని చెబుతున్నాయని, కానీ ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం పరిస్థితేంటని ప్రశ్నించారు. వానాకాలం కోతలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తుతోందన్నారు. కలెక్టర్ రానిదే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్ఐ ఎంత వారించినా రైతులు ధర్నా విరమించకపోవడంతో రూరల్ సీఐకి సమాచారం చేరవేశారు. సీఐ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. దాంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్డీవో వేణు, తహసీల్దార్ వాసంతి రైతుల వద్దకొచ్చి రేపటి నుంచి కొనుగోలు ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.