Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు, వరి సాగుపై మోడీ, కేసీఆర్ దొంగాట
- సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర నాయకులు కాసాని, కూనంనేని
- రైతుకు అండగా ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
టీఆర్ఎస్, బీజేపీ హైడ్రామాలు కట్టిపెట్టి తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నిర్బంధ వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సోమవారం సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్డులోని ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు, ఆంక్షలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు, సాగుపై కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ దొంగాట ఆడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై రైతులను నట్టేట ముంచే నిర్ణయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ప్రకటనలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని, రైతును రాజును చేస్తామన్న బీజేపీ ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులు, దళారీలకు మేలు చేసేందుకే పాలకులు పనిచేస్తున్నారని విమర్శించారు. పంటల సాగుపై అర్ధాంతరంగా ఆంక్షలు విధిస్తూ రైతును నట్టేట ముంచుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించాలన్నారు. వరి సాగుపై ఆంక్షలు ఎత్తేయాలని, ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని, తేమ, తరుగు పేరుతో రైతులను మోసం చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. తగినన్ని గోనెసంచులను సరఫరా చేయాలని, వరి కోతకు టోకెన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘాల జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాథం, కున్సోతు ధర్మ అధ్యక్షతన జరిగిన ధర్నా సభలో సీపీఐ(ఎం) నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, జాటోతు కృష్ణ, కొండపల్లి శ్రీధర్, ఆర్.శ్రీనివాసరావు, వీర్ల రమేష్, కొండబోయిన వెంకటేశ్వర్లు, యాస నరేష్, వి.నాగేశ్వర్రావు, ఈసం నర్సింహారావు, మహిళా సమాఖ్య నాయకురాలు జ్యోతి, సీపీఐ నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, వి.పూర్ణచందర్రావు, వాసిరెడ్డి మురళి, గుండెపిన్ని వెంకటేశ్వర్ రావు, భూక్య దస్రు, జి.రామనాధం, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.