Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలకు దళిత, ప్రజాసంఘాల డిమాండ్
- 17న వికారాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్న ఎస్పీ నారాయణపై చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్, దళిత, గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దోమ మండలం రాకొండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్న సర్పంచ్, అతని అనుచరులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
పోలీసులు ఎమ్మెల్యేకు, స్థానిక అధికార పార్టీ నాయకులకు భయపడి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకుండా పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ పూడూర్, నవాబుపేట, వికారాబాద్, తాండూర్ మండలాల్లో కూడా దళిత, గిరిజనులపై దాడులు జరిగినప్పటికీ.. దాడి చేసిన వారు అధికార పార్టీ నాయకులు కావడంతో కేసులు నమోదు చేయడం లేదన్నారు.
ఎస్పీ వైఖరిపై డీజీపీ, మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్న జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న వికారాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, ఎమ్మార్పీఎస్ తాండూర్ మండల ఇన్చార్జి నర్సింలు, యాలాల మండల ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి నర్సింలు, ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.