Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు పరస్పర భౌతిక దాడులతో వడ్ల కొనుగోలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్చన్నయుద్ధం ముదిరి ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధంగా దాడులకు పాల్పడటాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఆ దాడుల రాజకీయ కోణంలో జరుగుతున్నాయి తప్ప రైతులకు ఒరిగేదేమీలేదని తెలిపారు.
ఆరోపణలు, దాడులు మాని యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయడంపై దృష్టిసారించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి యాసంగిలో ధాన్యమంతటినీ కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వానాకాలం పంటను యుద్ధప్రాతిపదికన కొనాలని సూచించారు. వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, సత్వరమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏడు వేలకు పెంచాలని కోరారు.