Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి ట్రాక్టర్లు, యంత్రాలు కిరాయి తీసుకోవద్దు
- దళితుల ఆర్థిక మూలాలు దెబ్బతిస్తున్న వీడీసీ
నవతెలంగాణ-మాక్లూర్
తమ చెప్పుచేతల్లో ఉండకుండా, ప్రశ్నిస్తే సహించని పెత్తందారుల ముసుగులో ఉన్న వీడీసీల అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దళితుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్నాయి. తమ శ్మశానవాటిక స్థలం కబ్జా అవుతుందని, కబ్జా కాకుండా చూడాలని కోరినందుకు దళితులపై వీడీసీ ఆంక్షలు విధించింది. వారి కిరాణా దుకాణాల్లో గ్రామస్తులు ఎవరూ సరుకులు కొనొద్దని, వారి ట్రాక్టర్లు, యంత్రాలు కిరాయికి తీసుకోవద్దని హుకుం జారీ చేసింది. అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లిలో ఆలస్యంగా వెలుగుజూసింది.
రాంచంద్రపల్లి గ్రామంలో మొత్తం 70 దళిత కుటుంబాలున్నాయి. వీరికి గ్రామంలోనే నిజాంసాగర్ కెనాల్ పక్కన శ్మశానవాటిక ఉంది. ఆ స్థలాన్ని పెత్తందారీ కుటుంబీకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వీరి గొడవలకు పరిష్కారం చూపకపోగా.. దళితులపై వీడీసీ ఆంక్షలు విధించింది. దళితులు నిర్వహిస్తున్న కిరాణా దుకాణాల్లో గ్రామస్తులెవరూ వస్తువులు కొనొద్దని, వారి ట్రాక్టర్లు, యంత్రాలు కిరాయికీ తీసుకోవద్దని బెదిరిస్తోంది. అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు చేయించింది. దళితులు గ్రామంలో ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చని, కానీ వారు నిర్వహిస్తున్న దుకాణాల్లో మాత్రం ఇతర కులస్తులెవరూ కొనుగోలు చేయొద్దంటూ వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో దుకాణం సరిగ్గా నడవక దండు అశోక్ తన కిరాణా దుకాణం పూర్తిగా మూసేశాడు.
ప్రస్తుతం సక్కి సంజీవ్ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. గ్రామ నడిబొడ్డున ప్రధాన సెంటర్లో ఉన్నా.. ప్రస్తుతం ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. దీంతో ఇటీవల కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి తమపై ఆంక్షలు పెట్టిన వీడీసీపై చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు.