Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టుచీరలకు ప్రపంచ ఖ్యాతి.. భూదాన ఉద్యమానికి నాంది
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
పట్టుచీరలకు ప్రపంచ ఖ్యాతిగాంచిన, భూదాన ఉద్యమానికి నాంది పలికిన భూదాన్ పోచంపల్లికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడ తయారైన చేనేత చీరల ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. చేనేత పట్టు, ఇక్కత్, రాజ కోటి చీరలు నూతన డిజైన్లతో ప్రపంచ దేశాల ప్రజలను ఆకర్షించాయి. అగ్గిపెట్టెలో పట్టే చేనేత వస్త్రాన్ని తయారు చేసిన ఇక్కడి కార్మికుల కళా నైపుణ్యం ఎంతో గొప్పది. పోచంపల్లిలో కొన్ని వందల కుటుంబాలు చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పోచంపల్లిని సందర్శించి ఇక్కడ తయారవుతున్న వస్త్రాలను పరిశీలిస్తారు. ఇక్కడ అనేక చిత్రాలు, షార్ట్ ఫిలిమ్లు చిత్రీకరించారు. ఇక్కడున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. భూదాన ఉద్యమానికి నాంది పలికిన వినోబాభావే, వి.రామచంద్రారెడ్డి కాంస్య విగ్ర హాలను పోచంపల్లిలో నెలకొల్పారు. భూదాన గంగోత్రిగా వెలసిన వినో బాభావే ఆశ్రమంలో బోధన ఉద్యమ చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పోచంపల్లి టూరిజం పార్క్‌లో చేనేత వస్త్ర తయారీ విధానాన్ని సందర్శకులు తెలుసుకునే విధంగా ఉంది. పోచంపల్లి, రేవన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువులో పర్యాటక దినోత్సవం సందర్భంగా బోటింగ్ ఏర్పాటు చేశారు. చెరువుకట్టపై మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. చారిత్రాత్మక కట్టడమైన 101 దర్వాజల భవనానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రతిపాదనలను పంపారు. పోచంపల్లిని వరల్డ్ బెస్ట్ టూరిజం ప్రాంతంగా ప్రకటించడం పట్ల స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గర్వకారణం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్ డబ్ల్యూటీఓ) ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేయడం గర్వకారణంగా ఉందని కేంద్ర సంస్కృతి, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి. కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా స్థానిక కళలు, చేతివృత్తులను పునరుజ్జీవింపజేయడానికి ఇలాంటి అవార్డులు దోహపదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్ రెండో తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్‌డబ్ల్యూటీఓ 24వ జనరల్ అసెంబ్లీ సెషన్లో ఆ అవార్డు అందజేస్తారని తెలిపారు.