Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సూరెన్స్ ఉద్యోగుల ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అవలంభిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలపై ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరు ఐక్యపోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్ టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ రీజినల్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.సుబ్బారావు అధ్యక్షతన బషీర్‌బాగ్‌లోని జనరల్ ఇన్సూరెన్స్ ప్రాంతీయ కార్యాలయం వద్ద రెండో రోజు ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఇఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి పి.వెంకట్రామయ్య, ఆర్బీఐ నాయకులు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు, ప్రభుత్వ రంగానికి, ప్రజలకు, రైతాంగానికి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నాయి వివరించారు. 2017 ఆగస్టు ఒకటి నుంచి బకాయిపడ్డ వేతన సవరణ సెటిల్మెంట్ చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్ పీఎస్‌ను రద్దు చేయాలనీ, ఉద్యోగులందరికీ 1995 పెన్షన్ స్కీంను వర్తింపజేయాలనీ, పెన్షన్‌ను పెంచాలనీ, ఫ్యామిలీ పెన్షన్‌ను కనీసం 30 శాతం ఇవ్వాలనీ, ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రయివేటీకరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ వద్ద వేతన సవరణ చేయడానికి కావాల్సిన ఆర్థిక సామర్థ్యమున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే చేయటం లేదని వారు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రయివేటీకరణ విధానాల్లో అమలులో భాగమే ఇదని వ్యాఖ్యానించారు. సవరణ చేయకపోగా కనీసం చర్చలకు కూడా ముందుకు రావటం లేదనీ, పెద్ద ఎత్తున పోరాటాలతోనే ఉద్యోగుల న్యాయమైన హక్కులు దక్కుతాయని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచిన కేంద్రం, తాజాగా గతంలో లేని విధంగా వారికి యాజమాన్య హక్కులు కల్పించిందని ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ ఇన్సూరెన్స్‌లో నూతన నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జీఐఇఏఐఏ హైదరాబాద్ బ్రాంచి ప్రధాన కార్యదర్శి శివశంకర్, బీవీకేఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి.ఎస్.ఎన్.మూర్తి, న్యూ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజరు కుమార్, ఓరియంటల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకురాలు కల్పన, నేషనల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీ. రవీందర్, హెచ్ఆర్ జీఐఇఏ అధ్యక్షలు ఎ.నారాయణ రావు పాల్గొన్నారు.