Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బండి సంజయ్ పై కేసు నమోదు
నవతెలంగాణ - చివ్వేంల/అర్వపల్లి/నల్లగొండ
రైతు పరామర్శ యాత్రలో రెండో రోజు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంలలో పీఏసీఎస్ కేంద్రాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు బండి సంజయ్ రాగా నే ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెం డాలతో నిరసన తెలిపారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం చెప్పులు, రాళ్లు, కర్రలు విసురుకున్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, మీడియా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు లాఠీలతో ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ బండి సంజయ్ ఓ రైతుతో మాట్లాడి వెళ్లిపోయారు. చివ్వెంల పర్యటన తర్వాత బండి సంజయ్ ఆత్మకూర్‌ఎస్, అర్వపల్లి మండలానికి రావాల్సి ఉంది. అంతకు ముందే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. చివరికి బండి సంజయ్ పర్యటన వాయిదా పడిందని తెలిసి ఇరు పార్టీల నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన బండి సంజయ్ పై కేసు నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సభలు, సమావేశాలకు అనుమతి లేదని, బీజేపీ నేత బండి సంజయ్ పర్యటనకు జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతీ తీసుకోలేదని, దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. బండి సంజయ్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలు ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేసినట్టు తెలిపారు. మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయని పేర్కొన్నారు.