Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీశాఖ అధికారులుగా బాధ్యతలు చేపట్టే శిక్షణార్థులు రానున్న తరాలకు పర్యావరణ వారధులుగా నిలవాలనీ, దేశాభివృద్ధిలో భాగమవుతూనే అడవులను రక్షించే విధులను సమర్థవంతంగా చేపట్టాలని పీసీసీఎఫ్ ఆర్. శోభ ఆకాంక్షించారు. కోయంబత్తూర్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 45 మంది అటవీ అధికారులు క్షేత్ర పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చారు. వారందరూ ఆయా రాష్ట్రాల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్)గా ఎంపికై కోయంబత్తూర్‌లో శిక్షణ పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మిజోరం రాష్ట్రాలతోపాటు జమ్మూ-కాశ్మీర్, లఢక్‌లకు చెందిన శిక్షణాధికారులు ఈ 45 మంది బృందంలో ఉన్నారు. వారితో అరణ్యభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో పీసీసీఎఫ్‌తో పాటు తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. శోభ మాట్లాడుతూ..రాష్ట్రంలో అటవీ శాఖ అమలు చేస్తున్న హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టిన పలు రకాల ప్రాజెక్టులు, పథకాలకు అటవీ అనుమతులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పద్ధతులను వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రోత్సాహంతో అటవీ శాఖ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో తమ రెండు రోజుల పర్యటన విజయవంతమైందనీ, అటవీ నిర్వహణలో సాంకేతికత వినియోగం, కంపాతో పాటు వివిధ పథకాల అమలు తీరును తెలుసుకున్నామని శిక్షణలో ఉన్న అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ ఏ.కే.సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, డీఎఫ్ఓ జోజి, ఓఎస్డీ శంకరన్, కోయంబత్తూరు అకాడమీ అధికారి డాక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.