Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్మిషన్స్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు నిరసన చేపట్టారు. మంగళవారం జేఎన్టీయూహెచ్ ప్రధాన ద్వారం వద్ద అడ్మిషన్స్ డైరెక్టర్ దిష్టిబొమ్మను వారు దహనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు జవ్వాజి దిలీప్, అశోక్‌గౌడ్, నాగరాజు మాట్లాడుతూ జేఎన్టీయూహెచ్లో పీహెచ్డీ అడ్మిషన్లలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన అడ్మిషన్స్ డైరెక్టర్ సిహెచ్ వెంకటరమణారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కేటగిరీ విద్యార్థులను బీసీ-డీ విద్యార్థిగా చూపి అడ్మిషన్ ఇచ్చారని వివరించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నెట్, సెట్, గేట్లో మెరిట్ ఉన్నా వారిని ఓపెన్ కేటగిరీలో పీహెచ్డీ సీటు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాతపరీక్షలో అర్హత సాధించకున్నా, ఇంటర్వ్యూ జాబితాలో పేరు లేకున్నా పీహెచ్డీ సీటు కేటాయించడం అవినీతికి నిదర్శనమని అన్నారు. 50 మంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు మెరిట్ ఉన్నా పీహెచ్డీ ప్రవేశం రాకపోవడం దారుణమని విమర్శించారు. ఈ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిల్, రుత్విక్, రేవంత్, నవీన్, అభినవ్, వర్షిత్, రోహిత్, శివతేజ తదితరులు పాల్గొన్నారు.