Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు : సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
- ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదికాలంగా ఉద్యమిస్తున్న రైతాంగానికి అండగా నిలబడాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. రైతాంగ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమైన సీఐటీయూ అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో తపన్‌సేన్ మాట్లాడుతూ గతేడాది నవంబర్ 26న రైతాంగ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. అదేరోజు కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెను చేపట్టాయని వివరించారు. రైతాంగ ఉద్యమానికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈనెల 26న అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసి ఐక్యంగా ఉద్యమించాలని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. జాతీయ సంపదను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్ముతున్నదని అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ పేరుతో మత విద్వేషాలను పెంపొందిస్తున్నదని వివరించారు. ప్రశ్నించే రాజకీయ నాయకులు, మేధావులపై ఉపా చట్టాన్ని, రాజద్రోహం కేసులను నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని విమర్శించారు. పౌరహక్కులు, ప్రజాస్వామిక విలువలను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నా రైతులు వీరోచితంగా పోరాడుతున్నారని చెప్పారు. రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. రైతులకు కార్మికులు, ప్రజలు మద్దతుగా, సంఘీభావంగా నిలబడాలని కోరారు. ఉమ్మడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. తపన్‌సేన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.