Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊహించని వారికి సీఎం కేసీఆర్ వరాలు
- మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్‌కు స్థానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఊహించని ట్విస్టులు ఇచ్చారు ప్రచారంలో ఉన్న నేతలను కాదని, ఏమాత్రం అంచనాలో లేని వారికి అవకాశం ఇచ్చారు. అనూహ్యంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వెంకట్రామిరెడ్డి ఉదయం రాజీనామా చేయగానే మధ్యాహ్నానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అమోదించేయడం, ఆ వెంటనే తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. భవిష్యత్‌లో ఆయన్ని రెవెన్యూ మంత్రిగా నియమిస్తారనే ప్రచారమూ జరుగుతున్నది. అలాగే ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్లిపోయాక, ఆస్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చివరి వరకు సస్పెన్సు థ్రిల్లర్‌ను తలపించింది. నామినేషన్లకు చివరి రోజు వరకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకుండా గోప్యతను పాటించారు. గత సాంప్రదాయానికి భిన్నంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండానే నేరుగా ఎంపిక చేసిన అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి చాలా మంది పేర్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిద్దరికీ సీఎం కేసీఆర్ షాకిచ్చారు. మధుసూదనాచారిని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుతున్నది. అలాగే నల్గొండ జిల్లా నుంచి ఎమ్సీ కోటిరెడ్డి తనకు ఎమ్మెల్సీ బెర్త్ కన్ఫర్మ్ అనుకుంటే, కేసీఆర్ కుదరదని దూరం పెట్టేశారు. దానితో రెండ్రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయనకు నిరాశే మిగిలింది. సిట్టింగుల్లో మహిళ, మున్నూరుకాపు కోటలో తనకు రెన్యువల్ వస్తుందనుకున్న ఆకుల లలిత ఆశలు నెరవేరలేదు. ప్రగతిభవన్ నుంచి సంకేతాలు వచ్చాయని ప్రచారం చేసుకున్న ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్ కూడా నిరుత్సాహపడ్డారు. రాజ్యసభ సభ్యుడుగా ఇంకా మూడున్నరేండ్ల పదవీ కాలం ఉన్న బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించడాన్ని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోలేకపోతున్నాయి. బండ ప్రకాశ్ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, లేదా కల్వకుంట్ల కవితకు అవకాశం ఇస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను రాజ్యసభకు పంపాలనే యోచనలో సీఎంకేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీలు వీరే...
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, గుత్తా సఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, బండ ప్రకాశ్లకు సీఎం కేసీఆర్ ఆవకాశం ఇచ్చారు. వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు.