Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్ జిల్లాలో ఆరుగురి గల్లంతు.. ఐదు మృతదేహాలు లభ్యం
'ఈ రోజు నాకొడుకు పుట్టిన రోజు సారూ...! వాడు ఏం పాపం చేశాడని దేవుడు మాకు ఇంత అన్యాయం చేసిండు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకును మాకు దూరం చేశావేంటి స్వామీ..! మేము బతికి ఏం సాధించేది!' అంటూ గల్లంతైన విద్యార్థుల్లో ఒకరైన శ్రీరాం క్రాంతిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. అదే రోజు కొడుకు పుట్టిన రోజే దూరమవ్వడంతో కన్నవారిని ఎవరూ ఓదార్చలేకపోయారు.
'లేకలేక పుట్టాడు నా కొడుకు. ఎన్నో పూజలు, ఎన్నో దేవుళ్లకు మొక్కితేగానీ 13ఏండ్లకు నా కడుపు పండింది. అల్లారుముద్దుగా పెంచుకుంటే కాలం మమ్మల్ని రోడ్డున పడేసింది. ఈ ఘోరం చేసేందుకా మేము బతికుంది' అంటూ మరో విద్యార్థి రాకేశ్ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్లటౌన్
మానేరు తీరం ఆరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. స్కూల్‌కు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు తిరిగి ఇం డ్లకు చేరలేదు. పాఠశాల నుంచి వస్తూ వస్తూనే సోమవారం మానేరువాగులో గల్లంతయ్యారు.. లేకలేక పుట్టిన ఆ కొడుకు.. పుట్టిన రోజు నాడే మరో విద్యార్థి ఆ కన్నపేగులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. సోమవారం సాయంత్రానికి ఒక విద్యార్థి మృతదేహాన్ని గుర్తించగా.. మంగళవారం మరో నలుగురి మృతదేహాలు బయటపడ్డాయి.
ప్రాణం తీసిన సరదా..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మానేరులోని చెక్‌డ్యామ్ వద్దకు సైకిళ్లపై వచ్చారు. కాసేపు ఇసుకలో సైకిల్ తొక్కిన తర్వాత ఆరుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు మానేరులోకి దిగారు. వారంతా 7, 8, 9 తరగతులు చదువుతున్నారు. లోతు ఎక్కువగా ఉండటం, ఈత రాకపోవడంతో అందరూ నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు విద్యార్థు లు భయంతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో కుటుంబీకులు, గ్రామస్తులు పోలీసులకు సమాచా రం అందజేశారు. మానేరు దగ్గరకు చేరుకున్న పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసున్న ఎస్పీ రాహుల్హెగ్దే, డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.అదే రోజు సాయంత్రం ఒకరి మృతదేహం దొరికింది. రాత్రి గాలితో కూడిన వాన కారణంగా గాలింపు నిలిపివేశారు. మంగళవారం ఉదయమే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మరో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన ఒకరి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు గణేష్, జడల సాయి, సింగం మనోజ్, తీగల అజరు, రాకేశ్, శ్రీరాం క్రాంతికుమార్. వాగు వద్ద బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
చెక్‌డ్యామ్ తెగడంతోనే..
మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ప్రాతంలో నిర్మించిన చెక్‌డ్యాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగింది. దీంతో అక్కడ లోతుగా గుంటలా ఏర్పడింది. అదే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఇసుక మేట వేయడంతో అది మరింత ప్రమాదకరంగా మారింది. ఇదేదీ తెలియని విద్యార్థులు తమకు ఈత రాకపోయినా స్నానాలు చేయాలని ఆ గుంట ఉన్న ప్రాంతంలోనే దిగడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఘటనపై దర్యాప్తు చేస్తాం : ఎస్పీ రాహుల్ హెగ్దే
సోమవారం మధ్యాహ్నం 9 మంది విద్యార్థులు మానేరు వాగు దగ్గరకు వచ్చారు. వారిలో ఆరుగురు స్నానానికి దిగి గల్లంతయ్యారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్నీ వెలికి తీసిన తర్వాత ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తాం
ప్రాజెక్టుల దగ్గర రక్షణ చర్యలు : ఐటీశాఖ మంత్రి కేటీఆర్
మానేరులో ఆరుగురు విద్యార్థులు గల్లంతవడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో జల వనరులన్నీ నిండుగా ఉండటంతో, జనం ఆయా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రాజెక్టుల దగ్గర కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : మూషం రమేష్- సీపీఐ(ఎం) రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రమాదానికి కారణమైన చెక్‌డ్యామ్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. చెక్‌డ్యాం, ఇతర జలాశయాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి.