Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ చట్టాలే కాదు.. విద్యుత్ సవరణ బిల్లులపైనా...
- ధాన్యం కొనుగోళ్లపై ఈరోజే ప్రధానికి లేఖ రాస్తా
- రేపు ఇందిరాపార్కు వద్ద ధర్నా : విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడి
- ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ చట్టాలే కాదు.. తెలంగాణకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లులపైనా కచ్చితంగా పోరాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. దీనిపై స్పష్టమైన వైఖరిని తెలపాలంటూ తాను కేంద్ర మంత్రులనూ, ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో ఈ అంశాన్ని ప్రస్తావించి, ఆ తర్వాత వివరాలను తెలుపుతామంటూ వారు హామీనిచ్చారని అన్నారు. ఇది జరిగి 50 రోజులైనా ఇప్పటికీ ఆ అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీరును నిరసిస్తూ గురువారం తమ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లందరూ పాల్గొంటారని వివరించారు. అనంతరం అదే రోజు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని సీఎం చెప్పారు. రెండు రోజులపాటు కేంద్రానికి అవకాశమిచ్చి... ఆ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే విషయమై ప్రభుత్వం తరపున ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ప్రధాని మోడీకి లేఖ రాస్తానని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ సమస్యపై కేంద్రం వైఖరి, బీజేపీ చేస్తున్న రాద్ధాతం, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి, సోమవారం నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలను కేసీఆర్ విశ్లేషించారు. వాటన్నింటిపై ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపుపై కూడా ఆయన వారికి వివరణిచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు మినహా మిగతా మంత్రులు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి తదితరులతో కలిసి సీఎం మాట్లాడుతూ... బీజేపీపైనా, బండి సంజయ్ పైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను, రైతులను సంజయ్ గోల్మాల్ చేస్తున్నారు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆయనవి దిక్కుమాలిన, దరిద్రపుగొట్టు ముచ్చట్లంటూ కొట్టిపారేశారు. యాసంగిలో వరి పండించాలంటూ ఆయన రైతులను రెచ్చగొట్టారని అన్నారు. ఇప్పుడు మాటమార్చి...ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ మార్కెట్ యార్డుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం... ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ చెబుతున్నది, అదే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం... ధాన్యం కొనాలంటూ ధర్నాలు చేస్తారు..? ఇదెక్కడి విచిత్రమంటూ ప్రశ్నించారు. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ కేంద్రం నుంచి ఆర్డర్ తెప్పించగలరా..? అని బండి సంజయ్ ను ప్రశ్నించారు. ధాన్యం పండించాలంటూ రైతులను రెచ్చగొట్టిన ఆయన.. బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాలనీ, లేదంటే ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. రైతులను, ప్రజలను ఇలా గందరగోళానికి గురి చేస్తున్న బీజేపీని తప్పనిసరిగా టీఆర్ఎస్ వెంటాడుతుంది.. వేటాడుతుందని మరోసారి హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీని వదిలిపెట్టబోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానివి చేతగాని, దద్దమ్మ చర్యలంటూ వ్యాఖ్యానించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించబోయే ధర్నాలో మీరు పాల్గొంటారా? అని అడగ్గా... 'ఇప్పుడే చెప్పాలా..? కాస్త సస్పెన్స్‌ను కొనసాగనియ్యండి...' అని కేసీఆర్ జవాబిచ్చారు. ఢిల్లీలో ధర్నా ఉంటుందా..? అని అడగ్గా...'ఇది కోర్స్ ఆఫ్ ఏజిటేషన్ (ఇది ఆందోళనా క్రమం)...' అంటూ స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు.