Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాక్టివ్గా ఉండాల్సిందే.. లేకుంటే కష్టమే..
- నల్లగొండ జిల్లా ఘటనపై మిగతా నేతలు స్పందించరా?
- బీజేపీ ప్యూహాలు చాలా డేంజర్
- ఎక్కడికక్కడ తిప్పికొట్టండి : ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ప్రతి ఒక్కరూ రాజకీయ పరిణామాలపై యాక్టివ్గా ఉండాల్సిందే. గమ్ముగా ఉంటే ఊరుకోను. వేగంగా స్పందించాల్సిందే. లేకుంటే మనుగడ కష్టమే. నిత్యం గమనిస్తూనే ఉంటా' అంటూ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తనదాక వస్తేగానీ తత్వం బోధపడదు అన్నది అర్ధమయ్యిందో ఏమోగానీ...భవిష్యత్లో బీజేపీ వల్ల జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. అందుకేనేమో..బీజేపీ వ్యూహాలు చాలా డేంజర్ అంటూ మంగళవారం నాటి శాసనసభాపక్ష సమావేశంలో ఆయన హెచ్చరించారు. ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. నల్లగొండలో బండి సంజరు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డినే స్పందిస్తారా? మిగతా వాళ్లకు నోళ్లు ఏమయ్యాయి? నల్లగొండ జిల్లాలో జరిగితే ఆ జిల్లా నేతలే స్పందించాలా? మిగతా జిల్లాల వాళ్లు మాట్లాడరా? తిప్పికొట్టరా? ఈ ధోరణి సరిగాదంటూ సీఎం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక నుంచి ఎవ్వరు కూడా గమ్మున ఉండవద్దని కూడా హెచ్చరించినట్టు సమాచారం. పార్టీ నేతలపైనా, పార్టీపైనా ఎక్కడ దాడి జరిగినా, ఆరోపణలు వచ్చినా అన్ని జిల్లాల నేతలు స్పందించాలని మందలిచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ఏది చేసినా మత, రాజకీయ రంగు పులిమి లబ్దిపొందాలని చూస్తుందని హెచ్చరించారు. కేంద్ర నాయకత్వం దగ్గర ఒక హామీ తీసుకుని దాని ప్రకారం నడుచుకుంటూనే ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతూ..కేంద్రంతో మళ్లీ సానుకూల ప్రకటన చేయించి లబ్ది పొందే ప్రమాదం కూడా ఉందని హితబోధ చేసినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అదే డ్రామా జరుగతున్నదనీ, దీన్ని ఎప్పకప్పుడు పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాలని సూచించినట్టు సమాచారం. ఇక, ఈ విషయాన్ని తానే దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాననీ, తాను ఇలా చేయాలని చెప్పేదాకా వేచిచూడకుండా వేగంగా స్పందించాల్సిందేనని ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. తనతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ సుతిమెత్తగా మందలిచ్చినట్టు కూడా సమచారం.