Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరుల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఉత్తేజపూరిత వాతావరణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికైంది. ఆ ప్రాంతమంతా ఎరుపెక్కింది. ఎర్రతోరణాలు, అమరవీరుల స్థూపం అందరినీ ఆకట్టుకుంది. అమరులు చేసిన త్యాగాలను అందరూ గుర్తు చేసుకున్నారు. వారి స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని నాయకులు ప్రకటించారు. జనరల్ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సూచకంగా సీఐటీయూ జెండాను ఆ సంఘం అఖిల భారత అధ్యక్షులు కె హేమలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'సీఐటీయూ జిందాబాద్, కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్, విత్‌డ్రా లేబర్ కోడ్స్, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అమరవీరులకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్తోపాటు నేతలంతా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 'లాల్ లాల్ జెండా హై, ఘనమైన చరితే నీది ఎర్రజెండా'అంటూ ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాల ప్రారంభసభ ఆ సంఘం అధ్యక్షులు కె హేమలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షోపన్యాసం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెరిగాయన్నారు. సమాజంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రపంచంలో ఒక శాతం సంపన్నుల వద్ద 32 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు కె నాగేశ్వర్ ప్రారంభోపన్యాసం చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, ఆహ్వానసంఘం చైర్మెన్ చుక్క రాములు సందేశాన్ని ఇచ్చారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ప్రతినిధుల సభ జరిగింది.