Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండ్రోజుల దేశవ్యాప్త సమ్మె
- కౌన్సిల్ సమావేశాల్లో కార్యాచరణ : సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
- ప్రజల్ని కాపాడుకుందాం..
- దేశాన్ని రక్షించుకుందాం నినాదంతో ముందుకు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రెండ్రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నట్టు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రకటించారు. సమావేశాల టైమ్‌టేబుల్ వచ్చాక తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు 'ప్రజల్ని కాపాడు కుందాం.. దేశాన్ని రక్షించుకుందాం' అనే నినాదంతో బలమైన ఐక్య ఉద్యమాలను చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను కౌన్సిల్ సమావేశాల్లో రూపొందించుకుంటామని చెప్పారు. సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు వల్ల చెన్నైలో 2020 జనవరిలో జరిగిన సీఐటీయూ జాతీయ మహాసభల తర్వాత భౌతికంగా జరుగుతున్న తొలి సమావే శాలు ఇవేనన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి నాలుగువందల కుపైగా కౌన్సిల్ సభ్యులు వచ్చారని చెప్పారు. మోడీ సర్కారు తెచ్చిన కార్మికకోడ్‌లు, వ్యవసాయ చట్టాల వల్ల జరగబోయే ప్రమాదం, నేడు దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యల పరిష్కారం మీదనే ప్రధానంగా ఈ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిపారు. నయా ఉదార విధానాల వల్ల ప్రపంచ వ్యాప్తంగానూ, దేశంలోనూ సంక్షోభం నెలకొన్నదనీ, దీని ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతున్నదని వివరించారు. తమ సమస్యలపై ప్రజలు స్పందించి పోరాటాల్లో వస్తున్నారని చెప్పారు. కరోనా విపత్తు సమయంలో మౌలిక సదుపాయాల కల్పనలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించడంలో తాత్సారం జరిగిందన్నారు. మోడీ సర్కారు 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేశామని సంబరాలు జరుపుకుంటున్నదనీ, వాస్తవానికి చూస్తే దేశంలో 30 నుంచి 35 శాతం మందికే వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. అందరికీ వాక్సిన్ వేసినట్టు గొప్పలకు పోతున్నదని విమర్శించారు. మోడీ సర్కారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. డిసెంబర్‌నాటికి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పినది ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రయివేటు కంపెనీలు తమ వ్యాక్సిన్లను మార్కెట్లోకి విడుదల చేసి సొమ్ముచేసుకునేలా సహకరిస్తున్నదని విమర్శించారు. క్లిష్టమైన, విపత్కర పరిస్థితుల్లో మోడీ సర్కారు అనాగరికంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు మేలు చేస్తూ ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన దేశం 201 ర్యాంకులో ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదనీ, మరోవైపు వేతనాలు తగ్గిపోతున్నాయని వాపోయారు. జీడీపీ గ్రోత్‌రేట్ నెగిటివ్‌కు పడిపోయిందని విమర్శించారు. 100 బిలియనర్ల ఆస్తులు 45 నుంచి 50 శాతం పెరిగాయని చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఏడాది కాలంగా పోరాటం జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. కార్మిక, కర్షక మైత్రితో పోరాటాలను ముందుకు తీసుకుపోయేందుకు సీఐటీయూ తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు.