Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామప్పకు కేంద్రం రూ.300 కోట్లు ప్రకటించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రాంత విశిష్టత చాలా గొప్పదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ చరిత్ర మసకబారిందని విమర్శించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగిన ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక్కత్ చీరలకు పోచంపల్లి ప్రసిద్ధి అనీ, 2005 లోనే జియో ట్యాగింగ్ వచ్చిందని చెప్పారు. నిజాం కాలం నుంచి నేటి ఇవాంకా ట్రంప్ వరకు వీరు నేసిన చీరెలు మన్ననలు పొందాయని వివరించారు. పోచంపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు. వందల ఏండ్లుగా ఉన్న రామప్ప ఆలయానికి ఇన్నాళ్లు ఎందుకు గుర్తింపు రాలేదని ప్రశ్నించారు. గత పాలకులు శ్రద్ద పెట్టి ఉంటే..ఈ పాటికి తాజ్మహాల్లాంటి విశిష్టత వచ్చేదన్నారు. రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.300 కోట్లు ఇవ్వాలన్నారు. త్వరలోనే బుద్ధవనం ప్రాజెక్టుకు కూడా ప్రపంచ గుర్తింపు వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కుల వృత్తులను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రదేశాలకు ప్రపంచ గుర్తింపుకోసం కృషి చేస్తామని వెల్లడించారు. దేశంలో రెండో జలపాతం ముత్యాల ధార తెలంగాణలోనే ఉందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు కేంద్రం రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పట్ల కేంద్రం అన్ని విషయాల్లోనూ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సహాయం చేయటంపై కేంద్రం దృష్టి పెట్టాలనీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటానైనా ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.