Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం సేకరణకు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తున్నదంటూ బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ నాయకులు ధర్నాలు, పర్యటనలు, ప్రకటనలు చేయడం మాని రాష్ట్రానికి అవసరమైన గన్నీ సంచులు, బియ్యం, ధాన్యం నిల్వలకు అవసరమైన స్టోరేజ్ స్పేస్, ధాన్యం కొనుగోలుకు అవసరమైన సీఎంఆర్ గడువు పొడిగింపు, హమాలీ ఛార్జీలు పెంచటం, రాష్ట్రంపై వడ్డీ భారం పడకుండా కేంద్రంతో మాట్లాడడం తదితరాంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేటశారు.
ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు 14 కోట్ల గన్నీ సంచులు కావాలని అడిగితే కేంద్రం కేవలం 6.4 కోట్లు మాత్రమే ఇచ్చిందనీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో వడ్డీ భారం పడుతున్నదని తెలిపారు. నిల్వకు అవసరమైన స్థలాన్ని చూపించకపోవటంతో సీఎంఆర్ కు అప్పగించటంలో ఆలస్యమై కూడా వడ్డీ భారం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానాలో ఒక్క క్వింటాల్‌కు హమాలీ ఛార్జీ కింద రూ.24.25 చెల్లిస్తున్న కేంద్రం, మన రాష్ట్రంలో మాత్రం రూ.5.65 మాత్రమే చెల్లిస్తున్నదని విమర్శించారు.