Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ
- పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆత్మగౌరవం చంపుకోలేకే తాము స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని రాష్ట్ర ఎంపీటీసీ,ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర నేత, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు చింపుల సత్య నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ముందు పెట్టిన తమ డిమాండ్లను పట్టిం చుకోకపోవడం అన్యాయమని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో తెలం గాణ రాష్ట్ర ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆ సంఘం నాయకులతో కలిసి సత్యనారాయణరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్ష కోట్ల మైనింగ్ నిధులను రాష్ట్ర ప్రభు త్వం వాడుకుందని ఆరోపించారు. రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని మైనింగ్‌కు సంబంధించి డబ్బులు వందల కోట్లు వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు. కోర్టు ఆదేశించి రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటివరకు రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థ లకు చెందిన 12 సీట్లలోను పోటీ చేస్తామని ప్రకటించారు. మా ఓట్లు మాకే వేయించుకుని తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు. తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే బరిలో నిలుస్తు న్నామని వివరించారు. టీఆర్ఎస్లో పార్టీకి ఫండ్ ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తు న్నారని ఆరోపించారు. శంభీపూర్ రాజు, తెరాచిన్నపరెడ్డి లాంటి ఆ కోవలోకే వస్తారని విమర్శించారు. ఓటెవరు వేస్తారనే అవగాహనా కూడా వారికి లేదని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఏనాడూ ఆయా జిల్లాల సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలైనా ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను ప్రభుత్వం పట్టించు కోలేదనీ, అభివద్ధికి నిధులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు సైతం తమకు మద్దతుగా ఉంటామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఏకం చేసి ఉద్యమిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థలు బాగుపడితేనే గ్రామాలూ అభివృద్ధిలోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. గెలుపొటములు పక్కనబెట్టి చైతన్యం తీసుకొచ్చేందుకే పోటీ చేస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల పేర్లను వారు ప్రకటించారు.
అభ్యర్థులు
నల్లగొండ -డా నగేష్, రంగారెడ్డి- సిహెచ్ శైలజారెడ్డి , ఖమ్మం-కొండపల్లి శ్రీనివాస్( టీఆర్ఎస్), మహబూబ్ నగర్ -మెట్టపల్లి పురుషోత్తం రెడ్డి( టీఆర్ఎస్) టి నిర్మల., మెదక్ -భాగ్యలక్ష్మిగోపాల్ రెడ్డి, కరీంనగర్-అశోక్ రావు (టీడీపీ), మాదాసు వేణు (టీఆర్ఎస్), నిజామాబాద్-మహిపాల్ యాదవ్( బీజేపీ)
ఆదిలాబాద్- షేక్ రజియా బేగం ,వరంగల్ - పి గొట్టయ్య, వేం వాసుదేవరెడ్డి