Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దల సభకే మొగ్గు చూపుతున్న కవిత
- అందుకే బండ ప్రకాశ్‌తో రాజీనామా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండాలంటే ఉంటా. కానీ కచ్చితంగా క్యాబినెట్లో చోటు కల్పించాలి. అది సాధ్యం కాకపోతే నన్ను రాజ్యసభకు పంపండి...' ఇదీ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత, సీఎం ముందు పెట్టిన డిమాండ్. శాసనమండలికి ఎన్నికైన తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ఆమె మండలిపై పెద్దగా ఆసక్తి లేనట్టు మాట్లాడటం గమనార్హం. 'అక్కడ పార్లమెంటులో 540 మందికిపైగా సభ్యులుంటారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ (శాసనమండలి) కేవలం 60 మంది సభ్యులే ఉన్నారు. ఈ సభలో మైకు లేకుండానే మాట్లాడొచ్చు. అది లేకుండా మాట్లాడినా అందరికీ వినబడుతుంది...' అంటూ ఆమె మీడియా మిత్రులతో వ్యాఖ్యానించటం గమనార్హం. దీన్నిబట్టే కవితకు మండలిపై పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రాజ్యసభ్యుడిగా బండ ప్రకాశ్‌కు ఇంకా మూడేండ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ... ఆయనతో రాజీనామా చేయించినట్టు వినికిడి. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి, దాన్ని కవితకు కేటాయించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కాకపోతే మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వని నేపథ్యంలో ఆయనకు సీఎం ఎలా న్యాయం చేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది.