Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ సూచనతో
బాలసదనంలో చేర్పించాలని ఆదేశాలు
నవతెలంగాణ-ముధోల్
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో మహిళ మృతిచెందడంతో ఐదు సంవత్సరాల బాలిక అనాథగా మారింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. బాలిక బాగోగులు చూడాలని సూచించారు. దీంతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బుధవారం ఎడ్బిడ్ గ్రామానికి వచ్చారు. బాలికను ఎత్తుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు రోషిణి, తల్లి పేరు భూమవ్వ అని కలెక్టర్‌కు చెప్పింది. అంగన్వాడీకి పోతున్నాని సమాధానం చెప్పింది. వెంటనే బాలికకు కొత్త బట్టలు అందించి, వైద్య పరీక్షలు నిర్వహించి బాలసదనంలో చేర్పించాలని కలెక్టర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. బాలిక బాగోగులు ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వెంటనే ఆమె పేరు మీద మార్పిడి చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. బాలికను తమ వంతుగా ఆదుకోవటానికి కొంత మంది దాతల ద్వారా సుమారు రూ.1.80లక్షలు వచ్చాయని స్థానికులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ డబ్బును బాలిక పేరిట జమ చేస్తామన్నారు. అంతకు ముందు ముధోల్ సీఐ వినోద్‌రెడ్డి తనవంతుగా రూ.10వేలు అందజేశారు. కలెక్టర్ వెంట భైంసా ఆర్డీఓ లోకేశ్వర్‌రావ్, తహసీల్దార్ శివప్రసాద్, సీడీపీఓ శ్రీమతి ఉన్నారు.