Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగి కొంటామని కేంద్రం రాతపూర్వకంగా ఇవ్వాలి: కేటీఆర్
- మానేరు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
నవతెలంగాణ - సిరిసిల్ల
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం పంట పూర్తిగా కొంటుందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మానేరు వాగులో ఈతకు వెళ్లి మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5లక్షల చెక్కులు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని, ఇంకా 3లక్షల టన్నులు కొనాల్సి ఉందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలి కానీ, రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటి వసతులకు ఎలాంటి సహాయాన్నీ అందించలేదని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనబోమనే విషయాన్ని కేంద్రం పున్ణసమీక్షించుకోవాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగడతామని, స్థానిక బీజేపీ ఆసత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్టపోతారని అన్నారు. బీజేపీ నాయకులు చెబుతున్నట్టు యాసంగి వరి ధాన్యం కొనే విషయం నిజమైతే, కేంద్రం రాతపూర్వకముగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బండి రెండు చెంపలు పగులకొట్టి, రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలు నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, టెస్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్రావు, తోట ఆగయ్య, జిందం చక్రపాణి ఉన్నారు.