Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వ్యవసాయ చట్టాలతో అనర్థం
- మార్కెట్ నిర్వహణ పేరుతో.. నిరుపేదలపై భారం..!
- కూరగాయలు విక్రయిస్తే రుసుం చెల్లించాల్సిందే
- చిరువ్యాపారుల నుంచి రూ.50చొప్పున వసూలు
- రైతు బజార్‌కు నిధులు నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం
రైతుల ఆర్థిక పరిపుష్టి.. తాను పండించిన కూరగాయలను తానే స్వయంగా అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ల నిర్వహణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఫలితంగా మార్కెట్లకు నిధుల విడుదల నిలిచిపోయింది. ఫలితంగా వాటి నిర్వహణ అధికార యంత్రాంగానికి భారంగా మారింది. దీంతో మార్కెట్ నిర్వహణ ఖర్చులను చిరువ్యాపారుల నుంచే అధికారులు వసూలు చేస్తున్నారు. ఇలా ఆదిలాబాద్‌లోని ఒక్కో రైతుబజార్లో రూ.1600నుంచి రూ.2వేల వరకు చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. రైతుబజార్లో కూరగాయలు విక్రయించాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుబజార్‌కు ప్రభుత్వం నిధుల కేటాయించడం నిలుపుదల చేయడంతో ఆ భారం చిరువ్యాపారులపై పడింది. రోజువారీగా కూరగాయలు అమ్ముకొని వచ్చే అరకొర ఆదాయంతో జీవనం సాగించే తమకు ఈ భారం కష్టంగా మారిందని చిరువ్యాపారులు అంటున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు పండించిన పంటను దళారుల చేతిలో పెట్టకుండా నేరుగా అమ్ముకునేందుకు గత ప్రభుత్వం రైతుబజార్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రం చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు వారు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, ఇతరత్రా పంటలను రోజువారీగా ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆదిలాబాద్ రైతుబజార్లో 70మంది వరకు రైతులు కూరగాయలు విక్రయిస్తే అదనంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు 25మంది వరకు అమ్ముతుంటారు. ప్రస్తుతం రైతుల నుంచి అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయకపోయినా స్వయం సహాయక సభ్యుల నుంచి మాత్రం రోజూవారీగా రూ.50వసూలు చేస్తున్నారు. ఈ సభ్యులు సొంతంగా పండించడం కాకుండా బీట్ నుంచి కొనుగోలు చేసి రైతుబజార్‌కు తీసుకొచ్చి అమ్ముతుంటారు. కుటుంబ పోషణ కోసం ఈ సంఘం సభ్యులు చాలా రోజుల నుంచి కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు భారం మోపడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇది వరకు రైతుబజార్ నిర్వహణ కోసం ప్రతి ఏటా రూ.8లక్షల వరకు నిధులు కేటాయించేది. కేంద్రం కొత్తగా వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో రైతులకు ఎక్కడైనా విక్రయించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్‌కు నిధుల కేటాయింపును ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెల నుంచి పూర్తిగా నిలిపివేసింది. దీంతో మార్కెటింగ్ అధికారులు నిర్వహణ ఛార్జీలను చిరువ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు.
అదనపు భారంతో సతమతం
రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రస్తుతం ఆది లాబాద్ పట్టణ శివారులో రోజువారీగా బీట్ కొనసాగుతోంది. ఈ సంఘాల సభ్యులు అక్కడ్నుంచి కూరగాయలు కొనుగోలు చేసి రైతు బజార్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. ఈక్రమంలో అక్కడ్నుంచి వినాయక్‌చౌక్‌లో ఉన్న రైతుబజార్‌కు కూరగాయల సంచులు తీసుకురావాలంటే ఆటో ఛార్జీ లు రూ.100వరకు చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు బీట్‌లో హమాలీ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
రైతుబజార్లో కూరగాయలు విక్ర యించడానికి వీరికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం కేటాయిస్తున్నారు. రోజు వారీగా కొనుగోలు చేసిన కూరగాయలు అన్ని అమ్ముడుపోకపోవడంతో నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ విక్రయిస్తే పెట్టు బడి మినహాయించి సుమారు రూ.200 నుంచి రూ.300 వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. ఇందులో ఆటో ఛార్జీలు, హమాలీ ఛార్జీలతో పాటు రైతుబజార్లో విడిగా రూ.50చెల్లించాల్సి రావడంతో వచ్చిన ఆదాయంలో రూ.150వరకు అదనపు చార్జీలే చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఈ పరిస్థితి లేకపోయినప్పటికీ.. కొత్తగా నిబంధనల ప్రకారం తప్పని పరిస్థితిలో చెల్లించాల్సి వస్తోందని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిరు వర్తకుల నుంచి అభివృద్ధి ఛార్జీలు వసూలు చేస్తున్న అధికారులు రైతు బజార్లో ఆ మేరకు సౌకర్యాలు మాత్రం లేదు. ఇప్పటికే వ్యవసాయ చట్టాల అమలుకారణంగా ఆదిలాబాద్ పత్తిమార్కెట్‌కు ఆదాయంరాకుండా పోయింది. దీంతో పాటు రైతుబజార్పరిస్థితి కూడా దయనీయంగా మారుతోంది.
నిధులు రాకపోవడంతోనే వసూలు : శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ
వ్యవసాయ చట్టాల అమలు తర్వాత రైతుబజార్‌కు ప్రభుత్వం నిధుల కేటాయింపును నిలిపివేసింది. గతంలో మాశాఖకు రూ.8లక్షల వరకు నిధులు వచ్చేవి. ఇందులో రూ.లక్ష వరకు రైతుబజార్ నిర్వహణ కోసం కేటాయించేవాళ్లం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం లేదు. దీంతో మార్కెట్ నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి వసూలు చేయాల్సి వస్తోంది.