Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కాషాయపార్టీకి చావుదెబ్బే
- లేబర్ కోడ్లపై గతంలో ఎనిమిది మంది ఎంపీలే మాట్లాడారు
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు 22 పార్టీలు ఏకమయ్యాయి
- ఇది మేం సాధించిన విజయం
- కేసీఆర్ కార్యాచరణ మీదే ఆయన సిన్సియారిటీ ఆధారపడి ఉంటుంది : సీపీఐ (ఎం) ఎంపీ ఎలమారం కరీం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పడేసిన మోడీ సర్కార్‌తో చావో.. రేవో తేల్చుకుం టామని సీపీఐ (ఎం) రాజ్యసభ సభ్యుడు, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎలమారం కరీం అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లోగా దాని సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు. మిషన్ ఉత్తరప్రదేశ్, మిషన్ ఉత్తరాఖండ్ పేరుతో ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తు న్నదని విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో దాని పప్పులుడకబోవనీ, ఆ పార్టీకి చావుదెబ్బ తగలటం ఖాయమని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎంత వేగంగా అమల్జేస్తున్నదో.. అంతే వేగంగా ప్రజా ప్రతిఘటన ప్రారంభమైందని, అదిప్పుడు దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నదని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన కరీం... బుధవారం స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మొదట్లో కేవలం ఎనిమిది ఎంపీలే గళం విప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో 22 పార్టీలు పోరాడుతున్నాయని గుర్తు చేశారు. ఇది తాము సాధించిన విజయమని అన్నారు. పెట్రో ధరలు, గ్యాస్ రేట్లు, కనీస వేతనాలు, లేబర్ కోడ్లు, సాగు చట్టాలు, నిరుద్యోగం తదితర ప్రజా సమస్యలు ముందుకు రాకుండా ఉండేందుకు బీజేపీ విభజించి, పాలించు అనే పద్ధతిని అనుసరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారిని కుల, మత ప్రాతిపదికన చీలుస్తున్నదని హెచ్చరించారు. మరోవైపు రాజ్యాంగ సంస్థలను సైతం నిర్వీర్యం చేస్తున్నదని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సూచనలు, సలహాలు, సవరణల నిమిత్తం 96 శాతం బిల్లుల(మొత్తం బిల్లుల్లో)ను పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపితే... మోడీ హయాంలో వాటి శాతం 11కు పడిపోయిందన్నారు. దీన్నిబట్టే పార్లమెంటు సాంప్రదాయాలు, పద్ధతులను బీజేపీ ఎంతమేరకు గౌరవిస్తున్నదనే విషయం విదితమవుతున్నదని విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరిట బీజేపీ సర్కార్... ప్రభుత్వ సంస్థలు, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నదని కరీం విమర్శించారు. వారు ఎప్పటిలోగా ఆయా సంస్థలను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు..? సంబంధిత షెడ్యూల్ ఏంటనే విషయాలను మాత్రం చెప్పటం లేదన్నారు. ఇలా వాటన్నింటినీ ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే దేశం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. కేరళలో ఇదే తరహాలో హిందూస్తాన్ పేపర్ కంపెనీ లిమిటెడ్‌లోని యూనిట్‌ను, కొచ్చిలోని రిఫైనరీని అమ్మకానికి పెడితే... అక్కడి కార్మికులు తిరగబడ్డారని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రం నుంచి వాటిని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేద్దామని భావించిన కేంద్రం... అక్కడి ప్రజల ఆందోళనలు గమనించి డైలమాలో పడిందని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో సర్కారు దవాఖానాలు ప్రజల ప్రాణాలను కాపాడిన తీరునుబట్టి... ప్రభుత్వరంగ సంస్థల ప్రాధాన్యతను గుర్తెరగాలని ఆయన కోరారు. లేబర్ కోడ్లు అమలైతే రానున్న రోజుల్లో దేశంలోని శ్రామికులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని కరీం చెప్పారు. సమ్మె చేసుకునే ప్రాథమిక హక్కును సైతం వారు కోల్పోతారని హెచ్చరించారు. ఒకవేళ వారు సమ్మె చేస్తే అది చట్ట విరుద్ధమవుతుందని అన్నారు. మీడియాలో పనిచేసే వారికి సైతం వేతన బోర్డు సిఫారసులు అమలు చేయబోరని తెలిపారు. ఐసీడీఎస్, ఎన్హెచ్ఎమ్, ఆశా తదితర వర్కర్లందరూ వాలంటీర్లుగా పరిగణించబడతారని వివరించారు. సాగుకు సంబంధించిన నల్ల చట్టాలు అమలైతే... ధాన్యం తదితర ఆహార పంటలను కేంద్రం, ఎఫ్‌సీఐ అసలే కొనుగోలు చేయబోవని అన్నారు. ఇదే జరిగితే మన ఆహార భద్రత పెను ప్రమాదంలో పడుతుందనీ, దేశం గతంలో ఎదుర్కొన్న సంక్షోభాన్ని మరోసారి చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలన్నింటిపై పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన రెండు రోజులపాటు సమ్మె చేపట్టనున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో సీఐటీయూ జాతీయ కార్యదర్శి కరీం మలయన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.సాయిబాబు, కార్యదర్శి ఎస్.రమ పాల్గొన్నారు.