Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మండలి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మండలి రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ అధికారిగా పని చేసిన కాలంలో వెంకట్రామిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిపై సీబీఐతో పాటు అనేక కేసులున్నాయని తెలిపారు. కేసులు క్లియరెన్స్ కాకుండా ఒక్క రోజులోనే ఆయన రాజీనామా ఎలా చేశారు? ఎలా ఆమోదించారని? ప్రశ్నించారు. ఆయన నామినేషన్ వేసిన విధానం పద్ధతి ప్రకారం లేదనీ, దరఖాస్తు కూడా సరిగా లేదని భట్టి చెప్పారు.
ఆ పత్రాలు ఆన్లైన్లో పెట్టాలి.....
వెంకట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో పొందుపర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సరిగా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల అధికారులు సమాచారాన్ని దాచిపెడుతున్నారనే విషయం స్పష్టంగా కనబడుతున్నదని తెలిపారు. డీవోపీటీ ఆమోదించిన తర్వాతే ..వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్టు రేవంత్ వివరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను కలిసి రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌తో పాటు వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పరిశీలకుని ద్వారా నివేదిక తెప్పించుకోవాలని కోరారు.
డిసెంబర్ ఒకటి నాటికి ఖాళీల భర్తీ : శివసేనారెడ్డి
డిసెంబర్ ఒకటి నాటికి రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనీ, నిరుద్యోగ భృతి ప్రకటించాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు రాక ఇప్పటికే రాష్ట్రంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణమే నిరుద్యోగ బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగ శంఖారావం పూరిస్తామని హెచ్చరించారు.
ధర్నా కాదు....అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి.....
ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసే ముందు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం ద్వారా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యంపై వర్షాకాలానికి ముందే కేంద్రం లేఖ రాసిందనీ, కేసీఆర్ మాత్రం ఆ లేఖ ఇప్పుడే వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.