Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఏది?
- ఢిల్లీ ధర్నాకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
- మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహ కేసులా..
- శాస్త్రీయ మార్గాల వల్లే చైనాలో విజయాలు : తమ్మినేని వీరభద్రం
- జనవరి 23 నుంచి తుర్కయాంజల్‌లో పార్టీ రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
''తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు డ్రామాలాడుతున్నాయి.. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 18న ధర్నా చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. అవసరమైతే ఢిల్లీలో కూడా చేస్తానన్నారు.. ఢిల్లీ ధర్నాకు అఖిలపక్ష పార్టీలను కూడా పిలిస్తే ఐక్యంగా కేంద్రంపై పోరాడతాం.. మోడీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు.. ఇలా అనేక మంది మేథావులను అరెస్టు చేశారు'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా మహాసభ జిల్లా కేంద్రంలోని బైరు మల్లయ్య, గట్టికొప్పుల రాంరెడ్డి నగర్, మాలి పురుషోత్తంరెడ్డి, మహ్మద్బిన్సయీద్ నగర్ ప్రాంగణంలో బుధవారం ప్రారంభమైంది. ముందుగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు పెన్నా అనంతరామశర్మ ఆవిష్కరించారు. అమరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సభలో తమ్మినేని ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశామని చెబుతున్న మోడీ ప్రభుత్వం.. 21 శాతం మందికి మాత్రమే రెండో డోసు వేసిందని.. డిసెంబర్ నాటికి రోజుకు కోటిన్నర మందికి వ్యాక్సిన్ ఇస్తేనే అందరికీ పూర్తవుతుందన్నారు. కరోనాతో దేశంలో 15 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమానికి రూ.4లక్షల కోట్లు, కోవిడ్ నివారణ కోసం రూ.35వేల కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం.. వాటిని తమ విలాసాలకు ఖర్చు చేసుకుందన్నారు. సీఏఏ చట్టం తీసుకొస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేశామన్నారు.
ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా గతంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేదన్నారు. కానీ ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని అధిగమించిందని చెప్పారు. కమ్యూనిస్టు, ఇతర ప్రజాస్వామ్య దేశాలను అణచివేసేందుకు కుట్ర పన్నిన అమెరికాలో నేడు రూ.90లక్షల కోట్ల సంపద ఉండగా.. చైనాలో రూ.120 లక్షల కోట్ల సంపద ఉందన్నారు. మార్క్సిజాన్ని అనుసరించడం వల్లే ఆ దేశం ముందుకెళ్లిందని చెప్పారు. కోవిడ్, ఆర్ధిక ఇబ్బందులు, ధరల పెరుగుదల లాంటి వాటికి కూడా కమ్యూనిస్టు దేశాల్లో పరిష్కారం లభించిందని తెలిపారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసులు లేవని, అదే అమెరికాలో లక్షల మంది చనిపోయారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ జనవరి 23,24,25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లవుతున్నా అభివృద్ధి ఏమీ లేదన్నారు. ధరల పెరుగుదల, నోట్ల రద్దు, నిరుద్యోగ సమస్య, మతోన్మాద చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. పాలకులు అభివృద్ధి చేస్తారన్న భ్రమలు ప్రజల్లో తొలగిపోయాయన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తే పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత నేడు అందరిచూపూ ఎర్రజెండా వైపు ఉందన్నారు. ఏడేండ్ల పాలనలో మోడీ తన గడ్డం పెంచుకున్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ఎమ్‌డి.జహంగీర్, మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, కొండమడుగు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.