Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 'కోర్స్ ఆఫ్ ఏజిటేషన్స్' (ఆందోళనా క్రమం)లో భాగంగా గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్న టీఆర్ఎస్... ఆ తర్వాత ఏం చేయబోతున్నామనేది మాత్రం చెప్పటం లేదు. తాను గతంలో ఎత్తేస్తానంటూ ప్రకటించిన 'ధర్నా చౌక్'లో ఈనెల 12న ఒకసారి ధర్నా చేసిన అధికార పార్టీ...ఈసారి దేశ రాజధానిలో పోరు చేపడుతుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా మళ్లీ అదే ఇందిరాపార్కును వేదికగా ఎంచుకోవటం గమనార్హం. కాకపోతే ఈసారి గులాబి దళపతి కేసీఆర్ స్వయంగా పాల్గొనబోతుండటం ప్రత్యేకాంశం. ఇదే సమయంలో గురువారం నాటి ధర్నా తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంతో తాడో, పేడో తేల్చుకోకుండా మోడీ సర్కారుకు మరోసారి (రెండురోజులపాటు) వెసులుబాటు, అవకాశమిస్తామంటూ ఆయన ప్రకటించటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆ తర్వాత ఏం చేస్తారనే దానిపై ప్రజలు మరింత ఆశ్చర్యానికి గురయ్యేలా... 'ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటూ రైతులకు చెబుతాం... దానిపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తాం...' ప్రకటించటం గమనార్హం. భవిష్యత్తులో వరి పండించాలా? వద్దా..? ఒకవేళ పండిస్తే కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? అనే విషయాలపై మోడీ సర్కారును గట్టిగా నిలేయాల్సిన తరుణంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మాత్రమే చెబుతాననటంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో కూడా ఎక్కడా సాగు చట్టాలనుగానీ, కేంద్రం విధానాలను కూడా ప్రశ్నించకుండా మొత్తం నెపాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మీద మోపటం గమనార్హం. ఇలాంటి అంశాలన్నింటికీ గురువారం ధర్నాలో కేసీఆర్ సమాధానమిస్తారో, లేదో వేచి చూడాలి.