Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల ఐక్య వేదిక పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించాయి. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చేస్తున్న పోరాటానికి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల అమల్లో భాగంగానే యాసంగిలో వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రకటిస్తున్నదని వివరించారు. 2013 ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే రాష్ట్రంలో పండిన పంటతోపాటు అదనంగా అవసరమవుతాయని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత దేశం మన పొరుగున ఉన్న చిన్న దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. దాదాపు 20 కోట్ల మంది ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వీరందరికీ ఆహార ధాన్యాలను సరఫరా చేస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో పండిన ఆహార ధాన్యాలన్నీ సరిపోతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించకుండా పేదలందరికీ వాటిని సరఫరా చేయాలన్నారు. రైతులు పండించిన పంటలన్నింటినీ కనీస మద్దతు ధరల చట్టం ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కార్మిక, విద్యార్థి, యువజన, మేధావి, మహిళ, సామాజిక, గిరిజన, మైనార్టీ సంఘాలన్ని ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, టీపీఎస్కే కన్వీనర్ హిమబిందు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, కెేవీపీఎస్్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక,్షకార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, ఉపాధ్యక్షులు టి రవి, వ్య.కా.స రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావేద్ తదితరులు పాల్గొన్నారు.