Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీఆర్ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై రాష్ట్ర రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారక రామారావు కోరారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ను గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, టి హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజరుతో కలిసి కేటీఆర్ కలిసి టీఆర్ఎస్ తరఫున వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. గవర్నర్‌గా సంతోషించాల్సిన విషయమని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ప్రతి విషయంలో మోడీ సర్కార్ రైతులను అయోమయానికి గురిచేస్తున్నదని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే రాష్ట్ర ప్రభుత్వం వారికి నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.