Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమలు, ఐటీ శాఖ సమీక్షలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా అనంతరం పరిస్థితుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను అందుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభంతో అనేక రంగాల్లో ఇబ్బందులు వచ్చినా, అదే సమయంలో మన లాంటి దేశాలకు అనేక నూతన అవకాశాలను కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, సంస్కరణలు తెలంగాణకు కలిసొచ్చే అంశాలని అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వివిధ దేశాల కంపెనీలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనీ, అవసరమైతే ఆయా దేశాల్లోని పారిశ్రామిక వర్గాలను రాష్ట్రానికి ఆహ్వానించి, ఇక్కడి పరిస్థితులను వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. వచ్చే సంవత్సరంలో వివిధ పారిశ్రామిక రంగాల వారీగా పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు.